కరోనా మహమ్మారి సినిమాకే సినిమా చూపుతోంది. కరోనా లాంటి విలన్ క్యారెక్టర్‌ను గతంలో చిత్ర పరిశ్రమ ఎన్నడూ చూసి ఉండదు. బహుశా మున్ముందు చూస్తుందని కూడా ఊహించలేం. కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవస్థల్ని తలకిందలు చేస్తోంది. దీంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి బతుకులు ఛిన్నాభిన్నం అవుతున్న దుస్థితి.
ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమను బతికించుకునేందుకు కోలీవుడ్ చిత్ర నిర్మాణ మండలి ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల్లో 50 % కోత విధించాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తి స్తోంది. లాక్డౌన్ కారణంగా మన దేశంలో మార్చి నుంచి బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు మూసి వేశారు. దీంతో వినోద పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో పడిపోయింది.
మరోవైపు లాక్డౌన్ నిబంధనలు సడలించి జూన్ నుంచి షూటింగ్‌లు జరుపుకోవచ్చని ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. అయితే కరోనా విజృంభణతో నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్దంది కరోనాబారిన పడుతుండడంతో షూటింగ్‌ల పరిస్థితి ఒక అడుగు ముందుకు, మూడడుగుల వెనక్కి అన్నట్టు తయారైంది. చాలా వరకు షూటింగ్‌లు ముందుకు సాగని పరిస్థితి. మరోవైపు షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ధైర్యంగా ముందుకు రావడం లేదు. అసలే పరిస్థితులు బాగలేనప్పుడు, కరోనాతో చెలగాటం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
షూటింగ్‌లు మధ్యలో ఆగిపోయిన సినిమాలకే దిక్కు లేనప్పుడు, ఇక కొత్త సినిమాల చిత్రీకరణ అవకాశాలెక్కడ? ఈ నేప థ్యంలో తమిళ చిత్ర నిర్మాణ మండలి బుధవారం చెన్నైలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారీ చిత్రాల నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని నిస్సహాయత, దుర్భర స్థితిపై చర్చించారు. కావున నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల్లో 50% కోత విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఒకవేళ కోత విధించని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోలేమని అభిప్రాయపడినట్టు తెలిసింది.
మిగిలిన అసోసియేషన్లతో వారంలోపు చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్టు సమాచారం. కాగా ఇప్పటికే పలుమార్లు పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతల నుంచి వచ్చిన విజ్ఞప్తికి నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర విభాగాల సిబ్బంది నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో నిర్మాత మండలే చొరవ తీసుకుని పారితోషికాల్లో కోత విధించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కోలీవుడ్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాం శమవుతున్న నేపథ్యంలో…టాలీవుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే అగ్ర నిర్మాత సురేష్‌బాబు లాంటి వాళ్లు పారితోషికాన్ని తగ్గించుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏ ఒక్క అగ్ర హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతలు పారితోషికంపై నోరు మెదపలేదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కూడా కోలీవుడ్‌ను అనుసరిస్తారా? లేక కష్టనష్టాలను భరిస్తారా? అనేది తేలాల్సి ఉంది.