కరోనా మహమ్మారి తానెంత అమానవీయమైన సూక్ష్మ జీవో ఒక్కో మరణం కథలు కథలుగా చెబుతోంది. కంటికి కనిపించకుం డానే, మనుషుల కలల్ని విధ్వంసం చేస్తోంది. బంధాలు, అనుబంధాల్ని తునాతునకలు చేస్తూ, వికటాట్టహాసం చేస్తోంది. మానవ జీవితాల్లో విలయతాండవం సృష్టించే రాక్షసుల గురించి కథలుగా చదువుకున్నాం. సినిమాల్లో చూశాం.
కానీ నిజ జీవితంలో కరోనా అనే మహమ్మారిని చూడకపోయినా, అది చేస్తున్న దుర్మార్గాలకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలాం. తాజాగా కరోనా బారిన పడిన ఓ వైద్యుడు (54) చివరిగా చేసిన ఆర్తనాధం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసేలా ఉంది. ఆ వైద్యుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కరోనా కాటుకు గురై చికిత్స పొందుతూ ఆ వైద్యుడు “అయ్యా అనారోగ్యంతో వచ్చే వారికి వైద్యం అందించే నేను కరోనా బారిన పడ్డాను. నా బిడ్డల కోసం బతికి తీరాలి. నాకు మెరుగైన వైద్యం అందించి బతికించండి” అంటూ ఆయన చేసిన ఆర్తనాధం…కరోనా మహమ్మారి ఎదుట చెవిటి వాని ముందు శంకం ఊదిన చందమైంది.
గుంటూరు జిల్లా తెనాలి ఆస్పత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇటీవల కరోనా సోకింది. దీంతో అక్కడి ఉద్యోగులు, సిబ్బంది శనివారం స్వాబ్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో అక్కడ పనిచేసే వారిలో ఒక వైద్యుడు, నర్సు, పారిశుధ్య కార్మికుడికి పాజిటివ్ అని ఆదివారం నిర్ధారణ అయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యుడిని గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. పెద్దగా ఆరోగ్యం మెరుగు పడలేదు.
పైపెచ్చు మంగళవారం రాత్రి ఆయన ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడలోని రాష్ట్ర కోవిడ్ కేంద్రానికి తరలించారు. క్షణక్షణానికి తన ఆరోగ్యం విషమిస్తోందని గ్రహించిన బాధిత డాక్టర్ తనను ఎలాగైనా బతికించాలని వేడుకోవడం ప్రతి ఒక్కర్నీ కదిలిచింది. వైద్యులు ఎంత పోరాడినా కరోనానే చివరికి విజయం సాధించింది. ఆ వైద్యుడి జీవన ప్రస్తానం విషాదాంతమైంది.