కొందరికి వయసు, అనుభవాలు పెరిగే కొద్దీ కొత్తకొత్త విషయాలు తెలిసి వస్తాయి. అర్రె…అలా చేయకుండా ఉండాల్సింది అనే అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. గతంలో చేసిన పనులను తిరిగి చేయకూడదనే గట్టి నిర్ణయం తీసుకుంటుంటారు.
అలాంటి మార్పే పంజాబీ సొగసరి పాయల్‌రాజ్‌పుత్‌లో కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా ఆమెలో జ్ఞానోదయం కలిగింది. ఇందుకు కారణాలు మాత్రం ఆమె చెప్పలేదు. కానీ మార్పులకు సంబంధించి వివరాలను ఆమె వెల్లడించారు. మున్ముందు తాను చేయదగిన, చేయకూడని పనుల జాబితాను బయట పెట్టారామె.
‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో ఈ అందాల తార ప్రవేశించారు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనే నానుడి ఈ సుందరాంగి విషయంలో నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎందుకంటే తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టారామె. ఆ తర్వాత ‘వెంకీమామ’ ‘డిస్కోరాజా’ చిత్రాలు కూడా ఆమెకు మరింత గుర్తింపు తేవడంతో పాటు అభిమానుల్ని అంతకంతకు పెంచాయి. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే టాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించాలని ఆఫర్లు వచ్చాయని ఆమె చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటం సాంగ్స్‌లో నటించేది లేదని పాయల్‌రాజ్ పుత్ తెగేసి చెబుతున్నారు. ఎందుకీ కఠిన నిర్ణయం తీసుకు న్నారో ఆమె చెప్పలేదు. కానీ తానేం చేయాలనుకుంటున్నదో మాత్రం గళగళా చెబుతున్నారు.
‘భవిష్యత్తులో ఐటెంసాంగ్స్ జోలికే వెళ్లొద్దనుకుంటున్నా. మహిళా ప్రధాన చిత్రాలు, కొత్తదనంతో కూడుకున్న విభిన్న కథల్ని ఎంచుకోవాలనుకుంటున్నా. తెలుగు చిత్రసీమలో నాకు ఎన్నో కలలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి టాప్‌స్టార్స్ సరసన నాయికగా నటించాలన్నది నాకున్న బిగ్ డ్రీమ్’ అని ఆమె చెప్పుకు పోయారు.
అంతేకాదు, రమ్యకృష్ణ నటనను ఎంతగానో ఇష్టపడతానన్నారు. ఆమెతో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే అంతకుమించిన ఆనందం లేదని కూడా తన మనసులో మాటను పాయల్‌రాజ్‌పుత్ బయటపెట్టారు.