ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆయన పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఎంత సేపు కనిపిస్తాడనే అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
మొన్నటివరకు ఈ సినిమాలో చరణ్ అటుఇటుగా 25 నిమిషాలు కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. ఆల్ మోస్ట్ అంతా దానికే ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ ఎలిమెంట్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఆచార్యలో సిద్ధ పాత్ర సినిమాలో సెకెండాఫ్ మొత్తం కనిపిస్తుందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
“చరణ్ ది చాలా ముఖ్యమైన పాత్ర. ఇంకా చెప్పాలంటే ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్ దే. అంతే తప్ప ఏదో క్యామియోలా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. చరణ్ ది పెట్టాలని పెట్టిన పాత్ర కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఆచార్య అనేది చరణ్ కథ. మెయిన్ పార్ట్ చరణ్ దే. ఇక నిడివి విషయానికొస్తే.. చరణ్ సెకండాఫ్ అంతా ఉండొచ్చు. సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదు.”
ఇలా రామ్ చరణ్ పాత్ర నిడివిపై ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు కొరటాల. సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పాట రిలీజ్ అవ్వగా.. త్వరలోనే మరో సాంగ్ ను విడుదల చేస్తామని కొరటాల ప్రకటించాడు.
చరణ్-పూజాహెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ను రెండోపాటగా త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నాడు. ఇక షూటింగ్ విషయానికొస్తే, మరో 10 రోజులు మాత్రమే పెండింగ్ ఉందని, ఎప్పుడు షూటింగ్స్ మొదలైతే అప్పుడు దాన్ని పూర్తిచేస్తానంటున్నాడు.
అటు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై కూడా రియాక్ట్ అయ్యాడు కొరటాల. ప్రస్తుతం తారక్ సినిమాకు స్క్రిప్ట్ రాసే పనిలోనే ఉన్నానని.. అయితే ఆ స్క్రిప్ట్ రాసే పని కంటే, కరోనాతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు చేతనైనంత సహాయం చేసే పనిని ఎక్కువగా చేస్తున్నానని.. కొద్ది సమయం మిగిలితే తారక్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కొరటాల.