కోట్లకు కోట్లు ఎలా వచ్చినట్లు?

ఒకపక్క ఒకటే దుమారం. ఆంధ్రలో భీమ్లా నాయక్ సినిమాను అణచేసారు. అణిచేస్తున్నారు. అంటూ. ఎక్కడ చూసినా టికెట్ రేట్లు టీ, కాఫీ రేట్ల కన్నా తక్కువ వున్నాయంటూ హడావుడి. కానీ పట్టణాల్లో రేట్లు మామూలుగానే…

ఒకపక్క ఒకటే దుమారం. ఆంధ్రలో భీమ్లా నాయక్ సినిమాను అణచేసారు. అణిచేస్తున్నారు. అంటూ. ఎక్కడ చూసినా టికెట్ రేట్లు టీ, కాఫీ రేట్ల కన్నా తక్కువ వున్నాయంటూ హడావుడి. కానీ పట్టణాల్లో రేట్లు మామూలుగానే వున్నాయన్నది ఎవరికీ పట్టలేదు. 

ఇంత కట్టుదిట్టం చేసినట్లు వార్తలు వున్నా, తమ చిత్తానికి రేట్లు పెట్టి విక్రయించారన్నది ఎవరికీ పట్టలేదు. కొన్న ప్రేక్షకులకు తెలుసు ఏ రేట్లకు కొన్నారో. ఆ సంగతి అలా వుంచితే ఆంధ్ర, సీడెడ్ ల్లో కోట్లకు కోట్లు భీమ్లా కలెక్షన్ ఫిగర్లు కనిపిస్తున్నాయి. 

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు నాలుగు కోట్ల నలబై లక్షలు, ఈస్ట్ నాలుగు కోట్ల వరకు, వెస్ట్ నాలుగు కోట్ల వరకు ఫిగర్లు కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ మూసేసిన థియేటర్లు ఎన్ని? తెరచివున్న థియేటర్లు ఎన్ని? వాటిలో టీ కాఫీ రేట్ల కన్నా తక్కువగా అమ్మినది ఏ మేరకు. మూడు రోజులు వేసిన అన్ని ఆటలు ఫుల్స్ అయిపోతే వచ్చేది ఎంత?

ఈ లెక్కలు తీస్తే అసలు రంగు బయటపడుతుంది కదా? రేట్లు తగ్గించి అమ్మారో? ఎక్కించి అమ్మారో తెలిసిపోతుంది కదా? ఆ పని మానేసి భీమ్లా నాయక్ ను అణచేసారో అంటూ అదే యాగీ. ఈ మాత్రం ఆంక్షలు పెట్టకపోతే మూడు వందలు, నాలుగు వందలు అమ్మేసేవారు. ఇప్పుడు 150 నుంచి 200 మేరకు సరిపెట్టుకున్నారు.

ఇలా అధిక రేట్లకు విక్రయించబట్టే కదా సీడెడ్ లో మూడు రోజులకు ఏడు కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయి. లేకుంటే వచ్చేవా? కానీ పవన్ ఫ్యాన్స్ హడావుడి వేరుగా వుంది. పది రూపాయలు, ఇరవై రూపాయల రేట్లలోనే తమ హీరో ఇన్ని కోట్ల వసూళ్లు సాధించేసాడంటున్నారు. ఇంత తక్కువ ధరల్లోనే ఇన్ని కోట్ల వసూళ్లు సాధ్యమైతే ఇంక రేట్లు పెంచడం ఎందుకు?

నిజానికి జ‌రుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం చేయాల్సింది వేరుగా వుంది. అసలు ఎన్ని షో లు వేసారు. ఎంతకు అమ్మారు. వచ్చిన దానికీ దీనికి సరిపోలుతోందా? అన్న లెక్కలు తీయిస్తే అప్పుడు అసలు రేట్లు తెలుస్తాయి.