టాలీవుడ్ నటుడు కృష్ణుడికి షాక్ నుంచి కోలుకునేందుకు దాదాపు తొమ్మిది రోజులు పట్టింది. షాక్ అంటే ఏ కరెంట్ షాకో అనుకునేరు. అదేం లేదు. ఓ యువతి నుంచి లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న నటుడు కృష్ణుడు…ఎట్టకేలకు తొమ్మిది రోజులకైనా నోరు విప్పాడు. ఆ ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నాడు. నల్గొండ నుంచి ఓ అమ్మాయి తన ఫ్యాన్ అంటూ మాట్లాడిందని చెప్పడం ద్వారా…మొత్తానికి అమ్మాయితో మాట్లాడినట్టు సదరు నటుడు గారు నిర్ధారించాడు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన యువతి తనపై 139 మంది కొన్నేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని, చర్యలు తీసుకోవాలని ఈ నెల 21వ తేదీ హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు చేసిన వాళ్లలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు, కొంత మంది జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా యాంకర్ ప్రదీప్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో యాంకర్ ప్రదీప్ ఓ వీడియోను విడుదల చేశాడు. తానెలాంటి అత్యాచారానికి పాల్పడలేదని, ఆ ఆరోపణలతో తన కుటుంబం తీవ్ర మనోవేధనకు గురైందని వాపోయాడు. ఇలాంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లతో తనను మానసికంగా అత్యాచారం చేశారని ప్రతి విమర్శ చేశాడు.
కానీ నటుడు కృష్ణుడు మాత్రం ఇంతకాలం మౌనాన్నే ఆశ్రయించాడు. తనపై ఆరోపణలు నిజమా? అబద్ధమా? ఏదో ఒకటి చెప్పకుండా…తతంగాన్ని కళ్లప్పగించి సినిమా చూసినట్టు 9 రోజుల పాటు నోరు మెదపలేదు. ఆ విషయంపై స్పందించేందుకు నేడు శుభముహూర్తం అని భావించినట్టున్నాడు.
బాధిత యువతి తనపై చేసిన ఆరోపణలను కృష్ణుడు ఖండించాడు. ఇంతకూ ఆయన మాటల్లో ఏముందో తెలుసుకుని…ఒక అభిప్రాయానికి రావచ్చు.
‘నాపై అత్యాచార ఆరోపణలు రావడంతో షాకయ్యాను. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. మందు, సిగరెట్ తాగను, పబ్‌లకు వెళ్లను. నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. ఆరోపణలు రాగానే ఆ విషయాన్ని నా భార్యకు చెప్పాను. ఆమె నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు వారి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూడాలి. లాక్డౌన్ సమయంలో నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. నల్గొండ నుండి ఓ అమ్మాయి నా ఫ్యాన్ అంటూ మాట్లాడింది. నేను ఆమెతో తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నాది ప్రేమ వివాహం. నాకూ ఓ కూతురు ఉంది. నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నాపై ఆరోపణలు చేసే వాళ్లపై నేను చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని కృష్ణుడు చెప్పుకొచ్చారు.
ఏంటో ఈ మాత్రం చెప్పేందుకు ఇన్ని రోజులు టైం తీసుకుని ఆరోపణలకు బలం ఇచ్చినట్టు కాదా? లాక్డౌన్లో తనకు ఏ ఫోన్ కాల్ రాలేదంటూనే…మళ్లీ నల్గొండ నుంచి ఓ అమ్మాయి ఫోన్ చేసిందనడం, తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పడాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి. సహజంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టనే సామెత గుర్తు కొస్తే ఏం చేయాలి? అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని కృష్ణుడే చెబుతున్నప్పుడే…మిగిలిన విషయాలు మనకెందుకులేండి!