హరికృష్ణ తనయుడు, యంగ్‌హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌కు విబేధాలున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది. దీనికి వాళ్లు కారణాలు కూడా చెబుతుండడం విశేషం. లోకేశ్ కంటే ఆయన తమ్ముడు రోహిత్‌కు హరికృష్ణ కుటుంబం ఉంటే ఎంతో అభిమానమని చెప్పుకొస్తున్నారు.
నారా రోహిత్…యువ హీరో. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తమ్ముడు రామ్మూర్తినాయుడి కుమారుడే రోహిత్. సినిమాలంటే పిచ్చి. దాంతో సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా నిలదొక్కుకునేందుకు కిందామీదా పడుతు న్నాడు. ప్రయత్నంలో లోపం లేకుండా అతను చేస్తున్న శ్రమను చూస్తే…ఏదో ఒక రోజు మంచి సినిమాతో నిలదొక్కుకుంటాడనే నమ్మకం ఆయన అభిమానుల్లో ఉంది.
అన్నిటికీ మంచి రోహిత్ సంస్కారి. అతని సంస్కారానికి నిదర్శనంగా దివంగత నందమూరి హరికృష్ణ రెండో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడాన్ని చెప్పుకోవచ్చు. నిజానికి నారా రోహిత్ అన్న లోకేశ్‌తో పోల్చుకుంటే హరికృష్ణతో రోహిత్‌కు అంత ఎమోషనల్ బాండింగ్ లేదనే చెప్పాలి. ఇదే లోకేశ్ విషయానికి వస్తే నందమూరి వారి మేనల్లుడు, అల్లుడు అవుతాడు.
అయిన దానికి, కానిదానికి ట్వీట్లు చేస్తూ చావబాదే లోకేశుడు…తన మామకు నివాళి తెలపడం మాత్రం మరిచిపోయాడు. చంద్రబాబు మాత్రం తన ఫేస్‌బుక్ పేజీలో హరికృష్ణకు నివాళులర్పించారు. ఇదే రోహిత్ విషయానికి వస్తే భావోద్వేగ పోస్టు చేశాడు. అదేంటో చూద్దాం.
” నిస్వార్థం అనే మాటకు మనుష్య రూపం, చైతన్య రథసారధి, టైగర్ హరికృష్ణగారి ద్వితీయ వర్థంతి సందర్భంగా ఇవే నా నివాళులు. హనుమంతుడి ప్రస్తావన లేకుండా ఆ రాముడి కథ ఉండదు, మీ ప్రస్తావన లేకుండా మన తారక రాముని కథ ఉండదు. జోహార్ హరికృష్ణ” అని రోహిత్ ట్వీట్ చేశాడు. కనీసం తమ్ముడికి ఉన్న సంస్కారం కూడా లోకేశ్ లేకపోయిందే అని టీడీపీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి.
మరికొందరు మాత్రం కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. హరికృష్ణ రెండో వర్ధంతి అని లోకేశ్‌కు తెలుసునని, కావాలనే సోషల్ మీడియాలో నివాళి ఘటించలేదని చెబుతున్నారు. దీనికి కారణం హరికృష్ణ తనయుడు, యంగ్ హీరో జూనియర్ ఎన్జీఆర్‌తో విబేధాలే కారణమని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. వర్ధంతి సందర్భంగా మరోసారి బయటపడినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఏమో…చేయని ట్వీట్ వెనుక ఏ మర్మం దాగి ఉందో ఎవరికి తెలుసు. దేన్నీ కొట్టి పారేసేందుకు లేదు కదా!