ఒకప్పుడు తనదీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పరిస్థితే అని ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. తీవ్రమైన మానసిక ఒత్తడికి లోనై జీవితంపై విరక్తి చెందానని ఆమె చెప్పుకొచ్చారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ట్విటర్‌లో ఖుష్బూ స్పందించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు, ఇతరత్రా సమస్యలు ఎదురవుతుంటాయన్నారు. వాటిని అధిగమించాలే తప్ప భయపడి తనువు చాలించ కూడదన్నారు.
‘ప్రతి మనిషి బాధ, ఒత్తిడిని ఎదుర్కొంటాడు. నాకు అలాంటి సమస్యలు లేవని ఎవరైనా చెబితే.. అది అబద్ధమే. నేనూ మానసిక ఒత్తిడికి గురయ్యా. నా జీవితాన్ని ముగించాలి అనుకున్నా (ఆత్మహత్య). కానీ ఓ సందర్భంలో వాటితో పోరాడాలనే కసి ఏర్పడిం ది. నన్ను ఓడించి, నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఆ సమస్యల కంటే నేను దృఢమని నిరూపించాలనుకున్నా. నా ముగింపు కోసం ఎదురు చూస్తున్న వారిని ఓడించాలి నిర్ణయించుకున్నా’. అని ఖుష్బూ తనదైన శైలిలో స్ఫూర్తిమంతమైన మాటలు చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె ఏం ట్వీట్ చేశారంటే…
‘ఒక దశలో నా జీవితం నిలిచిపోయింది. సొరంగం చివరిలో చీకటిలో నిల్చొన్నా.ఎంతో భయమేసింది. ఈ సమస్యల్ని భరించడం కంటే శాశ్వత నిద్రలోకి వెళ్లడం సులభమైన మార్గమని ఆ క్షణంలో నిర్ణయించుకున్నా. కానీ నాలోని ధైర్యం నన్ను వెనక్కి లాగింది. స్నేహితులు నా దేవదూతల్లా మారారు. నన్ను మానసికంగా కుంగుబాటుకు గురి చేసి భయపెడుతున్న విషయాల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నా. నా జీవితంలో ఓ కాంతి రేఖ కోసం.. ఓ ఆశ కోసం.. ఓ అవకాశం కోసం ఎదురు చూశా. బాధల్ని వెనక్కి నెట్టి.. ఈ రోజు ఇలా ఉన్నా’. అని ఖుష్బూ వివరించారు.
కేవలం సినిమాలకే ఖుష్బూ పరిమితం కాలేదు. ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై చాలా స్పష్టమైన వైఖరితో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారామె. ఆత్మహత్య విషయంలోనూ తను నిజాయితీగా స్పందించారు. గతంలో తన మానసిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో వివరించారు. ఖుష్బూలోని ఈ నిజాయితీ, నిర్మొహమాట తత్వమే ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.