సినీ నటి, బీజేపీ నేత కుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే అధినేత తిరుమావళవన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఈ క్రమంలో చెన్నై నుండి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్లో మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల భద్రతకే ప్రాధాన్యత ఇస్తారని, తామూ ఆ మార్గంలోనే పయనిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది శక్తుల అకృత్యాలను సహించేది లేదని ఆమె ప్రకటించారు.