‘ప్రేమ కథలు చేసీచేసీ బోర్ కొట్టింది’ అని అంటున్నాడు హీరో నాగశౌర్య. ఐరా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘అశ్వథ్థామ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లడాడు.
‘ఏముంది ప్రేమను వ్యక్తపరచడానికి ఓ రోజా పువ్వు తీసుకుంటాం. రోజా పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అని మనసుకు నచ్చిన అమ్మాయి వెంట పడతాం. ఆమె కాదు, కూడదు అంటే ఓ ట్రాజెడీ సాంగ్ వేసుకుంటాం. ఇంతే కదా జరిగేది. ప్చ్…ఈ ఫీలింగ్స్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వడం లేదు. అందుకే కాస్తా వైవిధ్యం ఉండాలని ఆలోచించాను’ అని నాగశౌర్య చెప్పుకుపోయాడు.
మరి ‘అశ్వథ్థామ’లో ప్రేమ, దోమలాంటివేవీ ఉండవా అనే ప్రశ్నకు …‘అశ్వథ్థామ ఓ ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా కథ ఓ ప్రశ్న నుంచి పుట్టుకొచ్చింది. కౌరవ సభలో ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అందరూ చూస్తూ వినోదం పొందారు. కానీ అశ్వథ్థామ ఒక్కడే లేచి ఇదేమిటని ప్రశ్నించాడు. అమ్మాయిలపై అరాచకాలను ప్రశ్నించే యువకుడి కథే అశ్వథ్థామ ’ అని రాబోయే సినిమా విశేషాలను వివరించాడు.
మళ్లీ ప్రేమ కథతో ఎప్పుడు వస్తారో అనే ప్రశ్నకు…‘ప్రేమ కథలో రొటీన్‌కు భిన్నంగా చేయాలనుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేమలో వైవిధ్యభరితమైన కథతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నా పాత్రలో ఏడు కోణాలుంటాయి. ఆ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్. తింటే గారెలు, వింటే మహాభారతం, తీస్తే ఇలాంటి ప్రేమ కథా చిత్రాలే తీయాలన్నంత గొప్పగా ఉంటుంది’ అని నాగశౌర్య ముగించాడు.