మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నవారి పంచ్ డైలాగులతో ఆమధ్య వేడెక్కిన సినీ రాజకీయం కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ''మా'' రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఎక్కడివాళ్లు అక్కడ గప్ చుప్ అనుకున్న టైమ్ లో హేమ, ఒక్కసారిగా తేనెతుట్టును కదిపారు. తాజా అధ్యక్షుడు నరేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిరంజీవి లేఖతో ''మా'' రాజకీయం తారాస్థాయికి చేరుకుంది.
చిరంజీవి ఏమన్నారు..?
''మా'' ఎన్నికలు నిర్వహించడానికి అనువైన సమయం ఉంది. ఇంకా ఆపద్ధర్మ కమిటీతో కాలయాపన తగదు. త్వరలోనే కొత్త కమిటీ ఎన్నుకోవాలని కోరుతూ సీనియర్ నటుడు, ''మా'' క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి చిరంజీవి లేఖ రాశారు.
మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయని, ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ''మా'' కు కొత్త టీమ్ ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆలస్యం అయినందున కొత్త కమిటీకి 2024వరకు గడువు ఇవ్వాలని, ఆ తర్వాత యథాప్రకారం రెండేళ్లకోసారి ఎన్నికలు జరపాలని సూచించారు.
చిరంజీవి లేఖలో ఎక్కడా ఎలాంటి సంచలనం లేదు కానీ, ''మా'' సభ్యులెవరూ రచ్చకెక్కొద్దని ఆయన కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఎన్నికలు సత్వరం జరగాలనే అంశాన్ని ఆయన నొక్కి చెప్పారు. దీంతో ఇప్పుడు చిరు లేఖ మెగా సంచలనం అయింది. ఇన్నాళ్లూ తెరవెనక మాత్రమే ఉండి వ్యవహారం నడిపించిన చిరంజీవి, ఇప్పుడీ లేఖ ద్వారా ఎన్నికల అంశంలో ప్రత్యక్షంగా కలుగజేసుకున్నట్టయింది.
హేమ ఎందుకు బయటకొచ్చింది..?
నటి హేమ కూడా ఈ దఫా ''మా'' బరిలో అధ్యక్ష స్థానానికి పోటీ పడాలనుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన హేమ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డితో కలసి ఆమె ఉపాధ్యక్ష పదవికి సంయుక్తంగా ఎన్నికయ్యారు.
ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో కూడా ఆమెకు, నరేష్ కు మధ్య వాగ్వాదం జరగడం విశేషం. ఆ తర్వాత నరేష్ ప్యానెల్ తో సఖ్యతగానే ఉన్నా.. ఇటీవల తాను కూడా అధ్యక్ష బరిలో నిలుస్తున్నానని చెప్పి సచలనం సృష్టించారు హేమ. తాజాగా నిధుల దుర్వినియోగంపై ఆమె అధ్యక్షుడు నరేష్ పై ఆరోపణలు గుప్పించారు.
నరేష్ రియాక్షన్ ఏంటి?
హేమ ఆరోపణలపై వెంటనే స్పందించారు ''మా'' అధ్యక్షుడు నరేష్. నిధులు దుర్వినియోగం కాలేదని వివరణ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
కరోనా వల్ల ప్రస్తుతం వర్చువల్ విధానంలో సమావేశాలు జరుగుతున్నాయని, ఎన్నికల్ని వాయిదా వేయాలనే నిర్ణయాన్ని అంతా కలిసి తీసుకున్నామని అంటున్నారు.
బంతి కృష్ణంరాజు కోర్టులో..?
చివరిగా బంతి కృష్ణంరాజు కోర్టులో పడింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ అన్నమాటేకానీ, నేరుగా కృష్ణంరాజు ఎక్కడా ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. కనీసం ''మా''లో అంత రచ్చ జరుగుతున్నా ఆయన స్పందించలేదు. అయితే ఇప్పుడు స్వయంగా చిరంజీవి లేఖ రాయడంతో కృష్ణంరాజు స్పందించక తప్పని పరిస్థితి. ''మా'' వ్యవహారంపై ఆయన ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.
ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ఆరోపణలు, మంచు విష్ణు బాలయ్యని సీన్ లోకి తేవాలని చూడటం, బాలకృష్ణ రెచ్చిపోవడం.. ఇలా ''మా'' ఎన్నికల విషయంలో గొడవ బాగానే జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి లేఖాస్త్రంతో ''మా'' మంటలు మరింత రాజుకున్నాయి.