“మా” ఎన్నికలు 900 మెంబెర్స్ కి మాత్రమే సంబంధించిన ఒక చిన్న విషయం. గట్టిగా చెబితే ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎన్నికలన్నా పెద్దదేమీ కాదిది. కానీ పరిమాణంలో చిన్నగా కనిపిస్తున్నా ఈ ఎన్నికల ప్రభావం మాత్రం పెద్దదే. ఎలాగో చూద్దాం.
ఔనన్నా కాదన్నా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్ని కులాలున్నా రెండు కులాలమధ్య మాత్రం ఆధిపత్య పోరు అంతర్లీనంగా ఎన్నో ఏళ్లుగా నడుస్తూ వస్తోంది.
మరీ ముఖ్యంగా చిరంజీవి పెద్ద హీరోగా ఎదిగిన 1985 నాటి నుంచి చాలామంది కాపులు చిరంజీవి ఫ్యాన్స్ గానూ, పలువురు కమ్మవారు బాలకృష్ణ ఫ్యాన్స్ గానూ విడిపోవడం చూసాం. అలాగని భూమి మీదున్న ఏ కమ్మ వ్యక్తికీ చిరంజీవంటే పడదని కాదు, ఏ కాపుకీ బాలకృష్ణ నచ్చడనీ కాదు. ఎవరి టేస్టు ప్రకారం వారి అభిమాన తారలున్నా సమాజంలోని కొందరు మాత్రం ఈ గ్రూపిజంలో భాగమయ్యారు.
ఇప్పుడంటే వాల్ పోస్టర్ల హవా తగ్గింది కానీ, 1985-1995 ప్రాంతాల్లో వాల్ పోస్టర్ల మీద పిడకలు కనిపించేవి. ఒక వర్గానికి చెందిన ఫ్యాన్స్ మరొక వర్గం హీరో పోస్టర్ మీద ఏ అర్థ రాత్రో పేడ కొట్టి వెళ్లిపోయేవాళ్లు. అది పొద్దున్నకి ఎండి పిడకయ్యేది. దాని పర్యవసానంగా అవతలి వర్గం హీరో పోస్టర్ మీద మర్నాడు పిడక కనిపించేది. ఈ ఫ్యాన్ వార్స్ ఇంతటితో ఆగకుండా బ్యానర్లు చించుకోవడం, కొట్టుకోవడం దాకా కూడా కొన్ని చోట్ల కనిపించేవి.
ఈ జోరులో చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి స్టార్ కావడంతో కాపు వర్గం ఫ్యాన్స్ కి మరింత శక్తి వచ్చినట్టయ్యింది. దాంతో తమ అభిమానంతో రెచ్చగొట్టి మరీ చిరంజీవిని 2008 లో పొలిటికల్ పార్టీ పెట్టేలా చేసారు. ఆ తర్వాత కథ మనకి తెలుసు. ఇప్పటికీ అదే వర్గం పవన్ కళ్యాణ్ వెంటుండి తన పార్టీకి సైనికులుగా ఉన్నారు.
ఇక కమ్మవారికి 1983 నుంచీ టీడీపీ పుణ్యమా అని రాజకీయాల్లో హవా దాదాపు మూడున్నర దశాబ్దాలు కొనసాగింది. సినిమా రంగంలో ఆధిపత్యం ఎలాగూ ఉండేది. చిరంజీవిని మినహాయిస్తే అప్పటి టాప్ స్టార్లంతా కమ్మవారే. నిర్మాతలూ వారే.
2014 లో రాష్ట్రం రెండు ముక్కలవడంతో టీఆరెస్ దెబ్బకి తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఆంధ్రలో 2019 వరకు అధికారంలో ఉండి ఉన్నంతలో ఊపిరి పీల్చుకుంది.
సరిగ్గా 2019 ఎన్నికల్లో ఊహించని దెబ్బ తిని, చతికిలబడిపోయి, లేపడానికి సరైన రాజకీయ వారసుడు లేక టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.
అలా రాజకీయాల్లో తమ ఉనికిని పోగొట్టుకున్న కమ్మ సమాజిక వర్గానికి ప్రస్తుతం సినిమా రంగం మీద ఒకప్పటి పట్టుందా?
నెంబర్ వన్ నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా సినీ రంగాన్ని ఏలిన రామానాయుడి మరణం తర్వాత ఆయన తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు జాగ్రత్త పడి సినిమాలు నిర్మించడం తగ్గించేసారు. ఆయన కొడుకు రానా మంచి నటుడిగా జాతీయ గుర్తింపు పొందినా టాప్ స్టార్ గా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో లేడు. రామానాయుడు స్టూడియో షూటింగులకి అద్దెకివ్వడానికి ఉపయోగపడుతోంది తప్ప అంతకుమించి వ్యాపారం అక్కడేం జరగడంలేదు. ఆ రకంగా కమ్మసామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి కుటుంబం నెమ్మదించింది.
ఇక రామకృష్ణా స్టూడియోస్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీసిన ఎన్.టి.ఆర్ తన కుటుంబం నుంచి బాలకృష్ణని స్టార్ గా నిలబెట్టగలగారు. దాంతో మూడు దశాబ్దాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాన్స్ కి బాలకృష్ణ కులదైవంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన కెరీర్ చివరికొచ్చింది. వారసుడింకా తయారవ్వలేదు. తయారవుతాడన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. జూనియర్ ఎన్.టి.ఆర్ ఉన్నాడు కదా అనుకుంటే బాలకృష్ణ వారసుడిగా తనని చూడరు. తాను కూడా ఒక కులానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అస్సలు ఇష్టఫడుతున్నట్టు లేదు. ఆ రకంగా నందమూరి వంశం కూడా రథాన్ని ఆపేసినట్టుంది.
అక్కినేని వంశం పరిస్థితి కూడా ఇంతే. వారసులు ఇండస్ట్రీని శాసించే పొజిషన్లో లేరు. అన్నపూర్ణా స్టూడియోస్ ని అద్దెకిచ్చుకుని షో నడపడం, వస్తున్న సినిమాలు చేసుకోవడం తప్ప సామాజిక వర్గానికి కేరాఫ్ గా నిలబడే తీరిక, ఓపిక, ఆసక్తి ఈ కుటుంబానికి లేదు.
మహేష్ బాబు ఎప్పుడూ అందరివాడే. కమ్మ సమాజికవర్గం తమ హీరో అంటూ ఇతనిని ఎప్పుడూ ప్రత్యేకంగా భుజానికెత్తుకోలేదు. అదే తనకి మంచిదయ్యింది.
ఇక చిరంజీవి కుటుంబం విషయానికొద్దాం. ఆయనతో పాటు, తమ్ముడు పవన్ కల్యాణ్, కొడుకు రాం చరణ్, ఆ పక్కన అల్లు అర్జున్, సాయిధరం, వైష్ణవ్ తేజ్ ఇలా ఎందరో స్టార్స్ పుట్టుకొచ్చేసి డైరక్టర్స్ ని, నిర్మాతల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వీళ్లు పెట్టుకున్నారని అనడం కన్నా ఆ నిర్మాతలు, దర్శకులే వీళ్ళ గుప్పెట్లోకొచ్చారనడం కరెక్ట్. ఏ క్యాంపుని అంటిపెట్టుకుని వ్రేలాడితే వరుసగా సినిమాలు దక్కుతాయో అక్కడ ఉండడమే ఎవరైనా చేసే పని. అలా ఇండస్ట్రీని ఈ కుటుంబం శాసిస్తోంది. ఇదే సమాజిక వర్గానికి చెందిన కొందరు దర్శకులు కూడా ఈ క్యాంపు గూటి నుంచే తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు.
రాజకీయాల్లో ఎలాగో దెబ్బతిన్నాం కనీసం సినిమా రంగం మీద ఆధిపత్యాన్నయినా నిలబెట్టుకోవాలి అని కమ్మ సామాజిక వర్గం విష్ణు మంచు ప్యానల్ ని నిలబెట్టి విజయానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
పైగా చిరంజీవిని సినిమా రంగానికి పెద్ద దిక్కుగా ప్రొజెక్ట్ చేయడం బాలకృష్ణ నుంచి మోహన్ బాబు వరకు ఎవరికీ రుచించలేదు.
ఇప్పటికే మోహన్ బాబు, “ఇక్కడ ప్రస్తుతం పెద్ద దిక్కు ఎవ్వరూ లేరు. దాసరి గారితోనే అది అంతమైపోయింది” అని చెప్పేసారు.
అలా అప్పట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మోహన్ బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన దాసరిని గురువుగా భావించి పెద్ద దిక్కుగా చెప్పుకోవడం వల్ల బ్యాలెన్స్ అయ్యింది. కానీ ఇప్పుడలా లేదు.
రాజాకీయాల్లో ఎలాగో ఫెయిల్ అవుతున్నాం… సినిమా రంగమ్మీద వ్యాపారాత్మకంగా ఉన్న గ్రిప్ ని అధికారికంగా కూడా చేజిక్కుంచుకోవాలని కాపు సామాజిక వర్గం చిరంజీవి బ్యాకప్ తో కులం కలర్ అద్దకుండా ప్రకాష్ రాజ్ ని సీనులోకి దింపి అతని ప్యానల్ ని ప్రోత్సహిస్తోంది. ప్రకాష్ రాజ్ ని ముందు పెట్టి వెనుక నుంచి చిరంజీవి కుటుంబం చక్రం తిప్పుతున్న మాట ఓపెన్ సీక్రెట్.
మంచు విష్ణు వర్గం ఓడిపోతే సినిమా రంగమ్మీద కమ్మవారి పట్టు పోయిందని అధికారికంగా రుజువవుతుంది. అంతకు మించి వ్యక్తిగతంగా ఈ వర్గం వారికి కొత్తగా పోయేదేమీ ఉండదు.
కానీ చిరంజీవికి మాత్రం ఈ ఎన్నికలు పెద్ద సవాల్. ఆయన కొమ్ముకాసే వర్గం నెగ్గాల్సిన అవసరం ఆయన పెద్దరికానికి, పవన్ కల్యాణ్ రాజకీయ జీవితానికి ముడిపడి ఉంది.
ఒకవేళ ఓడిపోతే, “మా ఎన్నికల్లోనే నీ క్యాండిడేట్ ని గెలిపించుకోలేని వాడివి బయటి రాజకీయాల్లో ఏం పొడుస్తావ్?” అని అధికార పక్షం నాయకులు పవన్ కళ్యాణ్ ని దెప్పి పొడవచ్చు.
ఈ విషయం ఢిల్లీ దాకా వెళ్లి “పవన్ కళ్యాణ్ ఇంత వీకా” అనుకుని బీజేపీ వారు ఇద్దామనుకునే మద్దతులు, కురిపించాల్సిన అభయాలు ఆగిపోవచ్చు. చంద్రబాబు కూడా పవన్ తో పొత్తు అనేది ప్లస్ కంటే మైనస్ లాగా ఉందని ఆలోచనలో పడొచ్చు. జనసైనికులు కూడా అనుకున్నంత పట్టు తమ సామాజిక వర్గానికి సినిమారంగంలో లేదన్నమాట అనుకుని ఊపు తగ్గించొచ్చు.
కనుక ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలవాల్సిన అవసరం మెగా క్యాంపుకి ఎంతైనా ఉంది.
'మా' లో సభ్యులుగా ఉన్న 900 మంది చేతిలో పవన్ పొలిటికల్ ఇమేజ్ కూడా ముడిపడి ఉండడం విడ్డూరమే కానీ వాస్తవం.
ఇరు పక్షాలూ గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
శ్రీనివాస మూర్తి