'మా' న్యూ ఇయర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభసగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణం రాజు, టీ సుబ్బరామిరెడ్డితో సహా చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్ పరిస్థితిని వాడీవేడీగా మార్చాడు.
స్టేజ్ మీదకు ఎక్కి, మైక్ లాక్కొని దూకుడుగా వ్యవహరించారు రాజశేఖర్. మా లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, విబేధాలు ఉన్నాయి.. అనేది రాజశేఖర్ చెప్పదలుచుకున్నది.
అయితే మంచిని మైకులో చెప్పాలి, చెడును చెవుల్లో చెప్పుకుందాం అని చిరంజీవి అన్నారు. ఆ మాటలతో రాజశేఖర్ తీవ్రంగా విబేధించారు. నిప్పును కప్పి పుచ్చలేరని, పొగ వస్తుందని చిరంజీవితో విబేధిస్తూ రాజశేఖర్ మాట్లాడారు.
మధ్యలో మోహన్ బాబు వారించబోయినా.. రాజశేఖర్ మాత్రం వినలేదు. తను చెప్పాలనుకున్నది చెప్పి దిగిపోయారు.
మళ్లీ చిరంజీవి మైకు అందుకుని.. తను చెప్పిన మాటను పట్టించుకోలేదని, ఎందుకీ పెద్దరికం అని ప్రశ్నించారు. ఒక ప్రీ ప్లాన్డ్ గా రాజశేఖర్ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చడానికి వచ్చాడంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. అప్పటికే స్టేజ్ దిగిన రాజశేఖర్ మళ్లీ మాట్లాడాడు. తను ఎటువంటి ప్లాన్ తో రాలేదన్నాడు.
ఆ తర్వాత చిరంజీవి స్పందిస్తూ.. క్రమశిక్షణ కమిటీ ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించగా, నటుడు నరేష్ అందుకు సిద్ధమన్నట్టుగా సంజ్ఞలు చేయడం గమనార్హం.