తనకు మించిన మేధావి, తనకు మించిన అనుహభవజ్ఞుడు లేడని తరచూ చెప్పుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అప్పుడప్పుడు మాత్రం తన ఇంట్లో వాళ్లు ఇచ్చే సలహాలు మాత్రం అద్భుతంగా ఉంటాయని.. చెప్పుకుంటూ ఉంటారు. ఇన్నేళ్లూ చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో లోకేష్ ను మేధావిగా చూపించే ప్రయత్నం చేశారు.
తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినప్పుడు, ఆ పదవిని చేపట్టవద్దని లోకేష్ సలహా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు చెప్పుకుని ఉంటారు. అప్పుడు లోకేష్ తొమ్మిదో తరగతి చదివేవాడని, తనను పీఎంను చేస్తామంటూ దేశమంతా కోరితే.. ఆ పదవి తీసుకోవద్దని లోకేష్ సలహా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు సెలవిచ్చారు. అప్పటికే చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం. వెన్నుపోటుతో సీఎం అయినప్పటికీ, ఆయనను దేశంలోని నేతలంతా పీఎం పీఠాన్ని తీసుకొమ్మని కోరారట. అంత మేధావికి.. తొమ్మిదో తరగతి బాలకుడు అయిన లోకేష్ ఇచ్చిన సలహా అవసరమైంది!
అలా తనకు సలహా ఇచ్చిన లోకేష్ అపరమేధావి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇక రాజధాని రైతుల కోసం న్యూ ఇయర్ వేడుకలను తెలుగుదేశం అధినేత త్యాగం చేశారట. ఆ త్యాగం వెనుక కూడా చంద్రబాబునాయుడి ఆలోచన లేదట. ఆ మాస్టర్ సలహా ఇచ్చింది నారా భువనేశ్వరి అట. ఈ మాటను చంద్రబాబు నాయుడే చెప్పారు.
తన భార్య భువనేశ్వరి సలహా మేరకే తాము రాజధాని రైతుల కోసం న్యూ ఇయర్ వేడుకలను త్యాగం చేసినట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంత పెద్ద త్యాగం చేయాలనే ఐడియా తనది కాదని, తన భార్య భువనేశ్వరిది అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు తన ఇప్పుడు తన భార్య మేధస్సు గురించి వివరించారు. బహుశా ఇలాంటి ఐడియాలు చంద్రబాబుకు రావేమో. ఇంట్లో వాళ్లు చెప్పాల్సిందేనేమో అని ఎవరైనా అనుకుంటే.. అప్పుడెలా చంద్రబాబు గారూ!