గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందని ఆ సినిమాలో ఒక హీరో అయిన విక్టరీ వెంకటేష్ ధ్రువీకరించారు. ఆ సినిమా విడుదలైనప్పుడే సీక్వెల్ మాట వినిపించింది. అందుకు సంబంధించి ఇప్పటికే డిష్కషన్స్ ఒక కొలిక్కి వచ్చినట్టుగా, పాయింట్ కూడా ఖరారు అయినట్టుగా వెంకీ చెప్పారు. ఈ సీక్వెల్ పార్ట్ లో తనతో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తాడని వెంకటేష్ ధ్రువీకరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ పనులను చేపట్టనున్నాడని ఈ హీరో చెప్పాడు.
సంక్రాంతికి అనిల్ కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎఫ్ టూ సీక్వెల్ కు ఎఫ్ త్రీ పేరును ఖరారు చేసినట్టుగా వెంకటేష్ చెప్పాడు. మరో ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. సీక్వెల్ పార్టులో హీరోయిన్లు మారబోతున్నారట. ఎఫ్ 2లో తమన్నా, మెహ్రీన్ లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫుల్ గ్లామర్ షోతో పాటు.. కామెడీని కూడా వారు పండించారు. అయితే సీక్వెల్ లో మాత్రం వేరే హీరోయిన్లు ఉంటారని వెంకటేష్ ప్రకటించారు. వారెవరనే అంశం గురించి కసరత్తు చేస్తున్నారట.