నాగబాబు ఈటీవీని వదిలిపెట్టినా మల్లెమాల సంస్థ మాత్రం వెంటాడుతోంది. తమతో తెగతెంపులు చేసుకుని వెళ్తూ వెళ్తూ, తమపైనే విమర్శలు చేసేసరికి మల్లెమాల యాజమాన్యం కూడా నాగబాబుని టార్గెట్ చేసింది.
ఆయనతో పాటు, ఆయన చేస్తున్న షోలన్నీ ఆటోమేటిగ్గా టార్గెట్ అయ్యాయి. తాను బైటకు వెళ్లిపోతే జబర్దస్త్ కుప్పకూలుతుందని, తనతో పాటు టీమ్ లీడర్లంతా పొలోమంటూ వచ్చేస్తారని ఆశపడి భంగపడ్డారు మెగా బ్రదర్. దీంతో పాత టీమ్ లీడర్లందరినీ పోగేసుకుని జీ తెలుగులో అదిరింది అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు.
షో ఎలా ఉందనే విషయం పక్కనపెడితే.. దీన్ని ఈటీవీ టార్గెట్ చేయడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆదివారం రాత్రి 9.30గంటలకు అదిరింది వచ్చే టైమ్ లోనే ఈటీవీలో జబర్దస్త్ ఎపిసోడ్లను రీ-ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. నాగబాబు హైలెట్ అయ్యే ఎపిసోడ్లను ఏరికోరి మరీ వేస్తున్నారు. మధ్యలో యాడ్స్ గోల ఉండదు, స్కోర్లు చెప్పి విసిగించరు.. ల్యాగ్ లన్నీ ఎత్తేయడంతో.. ఒకరకంగా ఇది అదిరింది అనే కొత్త ప్రోగ్రామ్ కంటే బాగానే కనిపిస్తోంది. దీంతో నాగబాబు కూడా హర్ట్ అయ్యారు.
అదిరింది స్కిట్స్ లో జబర్దస్త్ ని టార్గెట్ చేయడం ఎక్కువైంది. నాకు అగ్రిమెంట్ లేదంటూ స్కిట్ లో భాగంగా టీమ్ లీడర్స్ పంచ్ లు వేయడం, పేమెంట్ తగ్గదంటూ సెటైర్లు వేయడం జరుగుతోంది. నాగబాబు ప్రోద్బలంతోనే ఈ సెటైర్లు పడుతున్నాయనే విషయం ఇక్కడ బహిరంగ రహస్యం. దీంతో మల్లెమాల యాజమాన్యానికి మరింత కాలుతోంది.
వాళ్ల కూడా జబర్దస్త్ స్కిట్స్ లో నాగబాబుపై… “అదిరింది” అనే కార్యక్రమంపై సెటైర్లు వేయడం ప్రారంభించారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కంటే.. ఒకర్నొకరు దెప్పిపొడుచుకోడానికే ఎక్కువ తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో రెండు టీవీ ఛానెళ్ల మధ్య అనుకోని వార్ మొదలైంది.
ఈ వార్ లో ప్రస్తుతానికి జబర్దస్త్ దే పైచేయిగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువమంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. అదిరింది అనే ప్రోగ్రామ్ జబర్దస్త్ కి పూర్తి కాపీగా తయారైపోయింది. యాంకర్ కూడా పెద్ద మైనస్. పాత కాన్సెప్ట్ లు, పాత కంటెస్టెంట్ లతో పాత వాసన కొడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటు జబర్దస్త్ లో మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.జబర్దస్త్ కు నాగబాబు కొత్త కార్యక్రమం ఏ మేరకు పోటీ ఇస్తుందనేది తేలాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.