‘మా’భారతంలో దాగున్న మహాభారతం

ధృతరాష్ట్రుడికి కొడుకు దుర్యోధనుడి మీద “గుడ్డి” ప్రేమ.  పాండవులంటే విపరీతమైన అసూయ. తన కొడుకులకన్నా పాండవులు పై స్థాయిలో ఉంటే అస్సలు సహించలేనంత కుళ్లు.  Advertisement ఇక దుర్యోధనుడికి ఎంతసేపూ అధికారదాహమే. పాండవులకి కనీసం…

ధృతరాష్ట్రుడికి కొడుకు దుర్యోధనుడి మీద “గుడ్డి” ప్రేమ.  పాండవులంటే విపరీతమైన అసూయ. తన కొడుకులకన్నా పాండవులు పై స్థాయిలో ఉంటే అస్సలు సహించలేనంత కుళ్లు. 

ఇక దుర్యోధనుడికి ఎంతసేపూ అధికారదాహమే. పాండవులకి కనీసం ఐదూళ్లైనా ఇవ్వడానికి మనసు రాని స్వభావం. అంతా తన కబ్జాలోనే ఉండాలి. పాండవులు అతని అదుపాజ్ఞల్లో ఉండాలి. 

ఇతనికి తోడైన వాడు శకుని. కురువంశాన్ని సర్వ నాశనం చేయడానికే పుట్టాడన్నట్టు బతికాడు.  

ధృతరాష్ట్రుడి మెదడులో పుట్టిన అసూయ దుర్యోధనుడి మనసులో పెరిగింది. శకుని ప్రమేయంతో విశ్వరూపం దాల్చింది. కురుక్షేత్రంలో నెత్తుటి కాల్వలో కురువంశం కొట్టుకుపోయింది. 

కానీ పాండవుల పక్షాన కృష్ణుడున్నాడు.  శకుని మాయకి ఎదురెళ్లగలిగే మహామాయ అతను. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడం, ఎత్తుకు పైఎత్తు వేయడం, పాండవులు ఎదుర్కోలేని శక్తుల్ని తానే ట్రాప్ చేసి నిర్మూలించడం వంటివి చాలా చేసాడు. అందుకే పాండవులు బతికి బట్టగలిగారు. 

ఇదంతా మహాభారతం. 

కానీ “మా”భారతం అలా కాదు. 

ఇక్కడ కృష్ణుడు లేని పాండవులకి, శకుని ఉన్న కౌరవులకి మధ్యలో సంగ్రామం అయి కూర్చుంది. మాయకి ఎదురెళ్లే మహామాయ లేక పాండవవర్గం ఓడిపోయి ఏడుస్తూ కూర్చుంది. 

ఇక్కడ మోహన్ బాబు వర్గాన్ని కౌరవులతోటి, చిరంజీవి వర్గాన్ని పాండవులతోటి ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే “నారుపోయకుండా, నీరు పెట్టకుండా పెరిగేది అహంకారం. అది నా సొంతం” అని మోహన్ బాబు 'రాయలసీమ రామన్న చౌదరి'లో చెప్పిన డయలాగ్ ఆయన నిజ స్వభావానికి కూడా సరిపోతోంది. గెలిచిన తర్వాత తనని తాను సింహంగా అభివర్ణించుకుంటూ చేసిన ప్రసంగం హీరో గెలిచినట్టు కాకుండా విలన్ గెలిచిన కలర్ ఇచ్చింది. పైగా ఒక స్త్రీని వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న గాయకుడి చేత అదే సభలో గజల్ పాడించి ఆ వేదికని విలన్ల వేదికగా మార్చేసినట్టయ్యింది. అందుకే ప్రస్తుతానికి వీళ్లు కౌరవులే. 

మోహన్ బాబు బూతులు తిడుతుంటే రక్తం మరిగినా తిరగబడలేకపోయానన్న నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ, “కొండను ఢీకొట్టడం అంత తేలిక కాదు. వెయ్యిలో ఒక్కడివల్లే సాధ్యం అవుతుంది” అన్నాడు. ఇక్కడ కొండంటే మోహన్ బాబే. మరి ఎదుర్కోగలిగే ఆ వెయ్యిలో ఒక్కడు ఎక్కడ?  

ఇదంతా ఒక ఎత్తైతే యుద్ధం ముగిసిన తర్వాత కూడా నేడు నరేష్ వ్యాఖ్యలు ఇంకా యుద్ధాన్ని కొనసాగించాలన్న ఉబలాటంతో ఉన్నట్టున్నాయి. 

“ఓడిపోతే ముండమోపుల్లా ఏడుస్తారేంటి?” అనేసాడు నరేష్. అంతటితో ఆగక మోహన్ బాబు బూతులు తిట్టినట్టు సక్ష్యాలు చూపించమన్నాడు. 

అసలే మోహన్ బాబు తిట్టిన బూతులకి అవమానం భారంతో కృంగిపోయి, పైపెచ్చు ఓటమిని కూడా మోస్తూ కుమిలిపోతున్న వర్గాన్ని “ముండమోపులు” అనడమేంటి? 

నరేష్ కి చిరంజీవి వర్గమంటే ఎందుకింత ద్వేషం? నలుగురిలోనూ అంతలా గేలి చేస్తూ బెనర్జీ, తనీష్, ఉత్తేజ్ లాంటి నటుల్ని అలాంటి మాటలనడం నిజంగా చిరాకు తెప్పించే విషయమే. 

“ఆ ఒక్కడు” లేకపోతే “మా” ఇలా అప్రతిష్ట పాలయ్యేది కాదని చిరంజీవి నుంచి శివాజీరాజా వరకు అందరూ అంటుంటే ఏమోలే అనుకున్న ప్రజానీకానికి కూడా ఈ రోజు దెబ్బతిన్న వర్గాన్ని “ముండమోపులు” గా అభివర్ణించిన “ఆ ఒక్కడిని” చూస్తే ఆ అందరి అభిప్రాయం నిజమే అని అర్థమవుతుంది.  

కయ్యానికి కాలు దువ్వుతూ, యుద్ధాన్ని కొనసాగిస్తూ నరేష్ సాధించేది ఏవిటి? ఒకవేళ తన హాయాములో జరిగిన అవకతవకలు తవ్వకాల్లో బయట పడకుండా ఉండడానికి ఆ వర్గం రాజీనామా చేసి వెళ్లిపోవాలనే కోరుకుంటున్నాడా? బుజ్జగింపులకి కూడా లొంగకుండా వాళ్ల మనసుల్ని ఇంకా తూట్లు పొడుస్తున్నాడా? 

“వాళ్ల రాజీనామాల విషయం కొత్త ప్యానల్ ఆలోచిస్తుందిలే” అన్నాడు. ఆ ప్యానల్ కి ఏం చెయ్యాలో చెప్పేది కూడా తానేగా! 

ఇదిలా ఉంటే చిరంజీవి వర్గంలో ఎవరైనా తమలో నిద్రపోతున్న శ్రీకృష్ణుడిని ఇప్పుడైనా నిద్రలేపగలరా? 

“ధర్మ సంస్థాపనార్థాయ..” అన్నట్టుగా ఏదైనా పావు కదపగలరా? “హే కృష్ణా! ముకుందా!! మొర వినవా..” అంటూ దెబ్బతిన్న “మా”పాండవులు పాడితే ఆ పాటకైనా దిగొస్తాడా? 

అసలా ఆపద్బాంధవుడు ఉన్నాడా లేడా? 

లేడని తేలిపోతే ఇక కౌరవపాలనలోనే తోక ముడుచుకుని బతికేస్తూ ఆత్మాభిమానమే ద్రౌపదిని కౌరవుల కాళ్ల మీద దాసిగా పడేసి రాజీనామా చేసి వెళ్లిపోవడమేనా? లేక దుర్యోధనుడే ధర్మరాజులా మారి అందర్నీ కలుపుకుని ముందుకెళ్లగలుగుతాడా?

“మా”భారతం కథ ఎలా నడుస్తుందో చూడాలి.

శ్రీనివాస మూర్తి