తమిళ నటుడు ధనుష్ తమ తనయుడు అంటూ కొన్నేళ్ల కిందట మద్రాస్ హై కోర్టును ఆశ్రయించిన దంపతులు వెనక్కు తగ్గడం లేదు! ఇప్పటికే వీరి పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిగింది. వారి చెబుతున్నట్టుగా ధనుష్ వారి తనయుడు అనేందుకు సరైన ఆధారాలు లేవని చెబుతూ ఇది వరకే కోర్టు వారి పిటిషన్ ను కొట్టి వేసింది. అయినప్పటికీ వారు తగ్గడం లేదు!
ముమ్మాటికీ ధనుష్ తమ తనయుడే అని, అతడు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి తాము వేసిన పిటిషన్ ను కొట్టి వేయించుకున్నాడని వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ధనుష్ కు మద్రాస్ హై కోర్టు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది!
ఈ కేసు ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా ఇది విచారణలో ఉంది. ధనుష్ తమ మూడో కొడుకు అని, చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడని కదిరేశన్, మీనాక్షి దంపతులు ఆరోపిస్తున్నారు. సినిమాలపై మోజుతో అతడు ఇంట్లోంచి పారిపోయాడని అంటున్నారు. అతడిని తమ తనయుడిగా ప్రకటించడంతో పాటు, నెలకు అరవై ఐదు వేల రూపాయలను తమ పోషణ నిమిత్తం ఇప్పించాలంటూ వారు కోర్టును కోరుతున్నారు.
సుదీర్ఘ విచారణ అనంతరం.. ధనుష్ కు డీఎన్ఏ టెస్టు చేయించుకోమని కోర్టు సూచించింది. అయితే అతడి లాయర్లు అందుకు సమ్మతించలేదు. వారు ధనుష్ కు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లను ఏవో సమర్పించినట్టుగా ఉన్నారు. అప్పట్లో వాటిని పరిగణలోకి తీసుకుని కోర్టు వారి పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
అయితే ఈ కదిరేశన్ దంపతులు మాత్రం ధనుష్ ను వదిలేట్టుగా లేరు. మరో తాజా పిటిషన్ తో వారు ధనుష్ ను కోర్టుకు లాగేట్టుగా ఉన్నారు.