గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈసారి మరింత పకడ్బందీగా స్కెచ్ వేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కుదిరితే అతడు ప్రయాణిస్తున్న కారులో, కుదరకపోతే ఫామ్ హౌజ్ లో హత్య చేయడానికి భారీ ప్రణాళిక రచించాడు.
దీని కోసం తన ముఠాకు చెందిన 60-70 మందిని ముంబయిలో దించాడు. రాయ్ ఘడ్, నవీ ముంబయి, థానె, పూణె, గుజరాత్ ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్లంతా నెల రోజులుగా సల్మాన్ ను గమనిస్తూనే ఉన్నారు. సల్మాన్ తిరిగే ప్రాంతాల్ని రెక్కీ చేశారు.
అంతేకాదు, సల్మాన్ ను హత్య చేసేందుకు పాకిస్థాన్ కు చెందిన ఆయుధాల వ్యాపారితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మాఫియా గ్రూప్ నకు చెందిన అజయ్ కశ్యప్, పాక్ కు చెందిన డోగర్ అనే వ్యక్తితో వీడియో కాల్ లో మాట్లాడాడు. ఏకే-47, ఎం-16, ఏకే-92 రైఫిళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్, తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, పార్టనర్ గోల్డీ బ్రార్ తో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నాడు. ముంబయి లోనే ఓ మైనర్ తో సల్మాన్ పై దాడి చేయడానికి వీళ్లు పథకం రచించారు.
సల్మాన్ ను షూట్ చేసిన తర్వాత ముంబయి నుంచి కన్యాకుమారికి చేరుకొని, అక్కడ్నుంచి పడవలో శ్రీలంకకు పారిపోయేందుకు కూడా వీళ్లు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ మొత్తం కుట్రను ముంబయి పోలీసులు భగ్నం చేశారు. పన్వెల్ లో నలుగుర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్ని అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా, వసీం చిక్నా, జావెద్ ఖాన్ గా గుర్తించారు. వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా లారెన్స్ బిష్ణోయ్ తో పాటు 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకుముందు ఇదే గ్యాంగ్ కు చెందిన సభ్యులు,సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.