తన తండ్రి బయోపిక్ రూపకల్పన జరిగితే ఆ సినిమాను నిర్మించేందుకు తను సిద్ధమంటూ ప్రకటించాడు నటుడు మహేశ్ బాబు. సర్కారు వారి పాట విడుదలకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్న మహేశ్.. తన తండ్రి బయోపిక్ గురించి మీడియా ప్రస్తావనపై స్పందించాడు.
ఆయన బయోపిక్ గురించి సాధ్యాసాధ్యాలను ప్రస్తావించని మహేశ్.. అలాంటి ప్రయత్నం జరిగితే ఆ సినిమాను తనే నిర్మిస్తానంటూ ప్రకటించాడు. అయితే అందులో నటించలేనంటూ మాత్రం మహేశ్ స్పష్టం చేశాడు.
ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన తనయుల్లో ఒకరు నటించి, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక తన తండ్రి బయోపిక్ గురించి నాగార్జున పెద్ద ఆసక్తిని కనబరచరు. తన తండ్రి జీవితంలో బయోపిక్ కు అవసరమైనంత ఎత్తుపల్లాలు లేవన్నట్టుగా ఇది వరకే నాగార్జున ప్రకటించినట్టుగా ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ధీటైన ఇమేజ్ తో వెలిగిన కృష్ణ జీవితంలో బయోపిక్ కు కావాల్సిన డ్రామా ఏమో కానీ.. సినీ నిర్మాణం, రూపకల్పనలో ఆయన డేర్ నెస్ మాత్రం ఎవరిగ్రీన్ అంశంగా నిలుస్తూ ఉంటుంది.
మరి సూపర్ స్టార్ బయోపిక్ రూపకల్పన జరుగుతుందో లేదో కానీ, అలాంటి ప్రతిపాదనతో వచ్చే వారికి మహేశ్ తన ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్టుగా ఉంది.
ఇక బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై కూడా మహేశ్ స్పందించాడు. తనకు బాలీవుడ్ లో నటించే ఆసక్తి ఏదీ లేదని మహేశ్ స్పష్టం చేశాడు. కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటించాలనే ఆసక్తి తనకు లేదని, బహుశా తను బాలీవుడ్ కు కూడా సెట్ కానట్టుగా మహేశ్ స్పందించాడు.
తన దృష్టి పూర్తిగా టాలీవుడ్ పైనే అని స్పష్టం చేశాడు. మిగతా టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా పలవరింతల్లో ఉంటే.. మహేశ్ మాత్రం అలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేస్తున్నాడు!