సంక్రాంతి సినిమాల సందడి ముగిసిందే. 50 డేస్ ఫంక్షన్ చేయడానికి అటు బన్నీ, ఇటు మహేష్ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ జనాలకు మాత్రం అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలపై ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఈ రెండు సినిమాల్ని మరో విధంగా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
థియేటర్లకు వెళ్లి మరోసారి డబ్బులు ఖర్చుపెట్టే కంటే డిజిటల్ మీడియం లేదా టీవీల్లో వస్తే చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేష్, బన్నీ సినిమాలు రెండూ మరోసారి సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంటే.. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాను నేరుగా టీవీల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ రెండు సినిమాలూ జెమినీ టీవీవే. కానీ వాటికి ఆ ఛానెల్ ఇస్తున్న ట్రీట్ మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. బ్లాక్ బస్టర్ అయిన అల వైకుంఠపురములో సినిమాను కేవలం తమ యాప్ కే పరిమితం చేయాలని ఛానెల్ నిర్ణయించింది. త్వరలోనే ఇది సన్ నెక్ట్స్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అటు సూపర్ హిట్టయిన సరిలేరు నీకెవ్వరు సినిమా మాత్రం నేరుగా టీవీలో ప్రసారం కాబోతోంది. ఈ మేరకు ఈ 2 ప్రోమోలు టీవీలో రన్ అవుతున్నాయి.
సరిలేరు నీకెవ్వరు సినిమాను మార్చిలో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్న సదరు ఛానెల్.. అల వైకుంఠపురములో సినిమాను మాత్రం ఓ మంచి సందర్భం చూసి వదలాలని అనుకుంటోంది. మరీ ముఖ్యంగా తన పోటీ ఛానెళ్లలో పెద్ద సినిమాలు ప్రసారమయ్యే టైమ్ చూసి బన్నీ సినిమాను వదలాలని భావిస్తోంది.