మహేష్‌ మోనార్కిజమ్‌ సమస్య అవుతోందా?

చిరంజీవి నంబర్‌వన్‌ హీరోగా వున్నపుడు పెద్ద పండక్కి ఆయన సినిమాలతో పాటు వేరే చిత్రాలు కూడా రిలీజ్‌ అవుతుండేవి. చిరంజీవి చిత్రాలకి పోటీగా అదే రోజున వేరే హీరోల సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో…

చిరంజీవి నంబర్‌వన్‌ హీరోగా వున్నపుడు పెద్ద పండక్కి ఆయన సినిమాలతో పాటు వేరే చిత్రాలు కూడా రిలీజ్‌ అవుతుండేవి. చిరంజీవి చిత్రాలకి పోటీగా అదే రోజున వేరే హీరోల సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అయితే వాటి రిలీజ్‌ని అడ్డుకోవడం కానీ, వాయిదా వేసుకోవాలని అడగడం కానీ జరిగినట్టు లేదు. కానీ మహేష్‌ మాత్రం తన సినిమాలు విడుదలవుతున్నపుడు తన కంటే మార్కెట్‌ తక్కువ వున్న హీరోల సినిమాలని వెనక్కి పోవాలంటూ హుకుం జారీ చేయడం, లేదా 'మీ సినిమా రిలీజ్‌ రోజునే నా సినిమా వేస్తాను' అంటూ బెదిరించడం లాంటివి తెర వెనుక చేస్తున్నాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఎంత పెద్ద సీజన్‌ అయినా కానీ తనకి ఫ్రీ గ్రౌండ్‌ వదిలేయాలని, తన సినిమాకి కనీసం మూడు రోజుల గ్యాప్‌ ఇవ్వాలని, అవతలి వారికి వీకెండ్‌ మిస్‌ అయినా కానీ తనకేం పట్టదన్నట్టు మాట్లాడుతున్నాడట. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయాలని ముందే డిసైడ్‌ అయ్యారు. 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని 14న విడుదల చేసుకోవాలని మహేష్‌ ఆ నిర్మాతలని ఆజ్ఞాపించాడు. కానీ పండుగ ముందు ఆదివారాన్ని మిస్‌ చేసుకోవడం ఇష్టం లేక జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని ప్రకటిస్తే తన సినిమా కూడా అదే రోజున వస్తుందని ప్రకటన ఇప్పించాడు.

పెద్దలు పూనుకుని రాజీ చేసిన తర్వాత 'అల వైకుంఠపురములో'కి మొదటి రోజు థియేటర్లు ఎక్కువ దొరకకుండా 12న కూడా చాలా థియేటర్లు 'సరిలేరు'కి బ్లాక్‌ చేసి పెట్టారు. దీంతో అల్లు అర్జున్‌ తన సినిమాని ముందుకి తీసుకెళ్లాలని భావిస్తే, అయితే తన సినిమా కూడా అదే రోజున వస్తుందంటూ మహేష్‌ మొదటికొచ్చాడు.

'సరిలేరు'కి, 'అల వైకుంఠపురములో'కి బిజినెస్‌ పరంగా ఒక పది కోట్ల అంతరం వుంటుందేమో. అంత మాత్రాన ఆ చిత్రానికి తొలి రోజున కలక్షన్లు ఎక్కువ రాకుండా అడ్డుకోవడం తగదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. సమ్మర్‌లో అయితే మహేష్‌కి కావాల్సిన అడ్జస్ట్‌మెంట్లు చేయవచ్చు కానీ సంక్రాంతికి ఈ విధంగా పేచీ పెట్టడం, అవతలి సినిమాలపై అజమాయిషీ చలాయించడం మంచి పద్ధతి కాదని అంటున్నారు.