ఓవైపు అమరావతిలో బంద్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ “ప్రాంతీయ” బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనసైనికులు కూడా బంద్ లో పాల్గొంటున్నారు. సరిగ్గా సమయం చూసి మరోసారి జనసేన ఎమ్మెల్యే రాపాక బయటకొచ్చారు. 3 రాజధానుల అంశానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
“రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండడం సబబే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. విభజన టైమ్ కు మనం ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత అనుభవాల దృష్ట్యా 3 రాజధానులు పెడితే, భవిష్యత్తులో ఎవ్వరూ ఇబ్బంది పడరనేది జగన్ అభిప్రాయం. దాంతో నేను ఏకీభవిస్తున్నాను.”
ప్రారంభం నుంచి జనసేన పార్టీకి, రాపాక మధ్య గ్యాప్ కనిపిస్తూనే ఉంది. తాజాగా రాజధాని అంశంపై రాపాక స్పందన మరోసారి జనసేన పార్టీని ఇరకాటంలో పడేసింది. ఓవైపు అమరావతి బంద్ జరుగుతుంటే, మరోవైపు రాపాక ఈ ప్రకటన చేయడంతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ ఇరుకున పడ్డారు.
ఈరోజు పొద్దున్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాపాక, రాజధాని అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికెత్తేశారు రాపాక. సంక్షేమం-అభివృద్ధి ఎజెండాతో జగన్ అధికారంలోకి వచ్చారని… నవరత్నాలతో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారని, ఇప్పుడు 3 రాజధానులతో అభివృద్ధిని పట్టాలపైకి తీసుకొచ్చారని ప్రశంసించారు.