తన సమవుజ్జీలు అనే హీరోలు వేరే భాషల మార్కెట్‌ని కూడా సంపాదించడంలో బిజీగా వున్నపుడు ఏ స్టార్ అయినా తాను కూడా అలాంటి చిత్రం చేయాలని తొందర పడతాడు. తాను కూడా అలాగే పర భాషల మీద ఫోకస్ పెడతాడు. కానీ మహేష్ మాత్రం ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నా, ఎన్టీఆర్ – చరణ్ కూడా అదే పని మీద వున్నా తన పనేదో తాను చూసుకుంటున్నాడు.
మిగతా వాటి వల్ల ప్రభావితం కాకుండా కేవలం తెలుగు మార్కెట్ మీదే దృష్టి పెడుతున్నాడు. దీంతో మహేష్‌కి ఎక్కువ ఆప్షన్లు దొరుకుతున్నాయి. ఎంతగా అంటే రంగస్థలం తర్వాత సుకుమార్‌తో చేసే చిత్రాన్ని కూడా మహేష్ వదిలేసుకున్నాడు. అది తనని ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. ఇప్పటికీ తనకోసం క్యూ కడుతోన్న దర్శకులు చాలా మందే వున్నారు.
తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్ల వద్ద నెమ్మదిగా సెటిల్ అవుతోంది. అయితే ఇది గ్యారెంటీ మార్కెట్ కాదు. పెద్ద సినిమా అటు, ఇటు అయితే ముప్పయ్, నలభై కోట్లు ఎగిరిపోతున్నాయి. అందుకే ఈ మార్కెట్‌ని స్టేబులైజ్ చేసుకుని అందుకు తగ్గ సినిమాలు చేయడం కూడా గొప్ప సంగతి. ఉన్నపళంగా పక్క భాషల్లోకి వెళ్లిపోయి తెలుగు మార్కెట్‌ని విస్మరించడం వల్ల ఉపయోగం లేదు మరి.