ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న హాట్ గాసిప్ ఒక్కటే. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫైట్ మాస్టర్లు నచ్చలేదు. షూటింగ్ ఆపేసారు. అన్నపూర్ణలో జరగాల్సిన దర్శకుడు త్రివిక్రమ్ సినిమా షూట్ ఆగిపోయింది. దీంతో ఫైట్ మాస్టర్లు ప్యాకప్ అంటూ వెళ్లిపోయారు. కానీ నిర్మాణ సంస్థ మాత్రం అలాంటిదేం లేదు అని ఖండిస్తోంది.
ఈ వైనం అంతా ఇలా వుంది.
త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ సినిమా షూట్ ఓ యాక్షన్ సీన్ తో ప్రారంభమైంది. ఈ యాక్షన్ సీన్ చాలా భారీ సీన్. ఇది కొంత ఇండోర్ లో వేసిన సెట్ లో, మరి కొంత రామోజీ ఫిలిం సిటీలో ఓపెన్ ప్లేస్ లో షూట్ చేయాల్సి వుంది. దీనికి ఫైట్ మాస్టర్లుగా కేజిఎఫ్, విక్రమ్ సినిమాలకు పని చేసిన టాప్ ఫైట్ మాస్టర్లు ‘అంబు-అరివు’ లను తీసుకున్నారు. వీరు కూడా మరో రామ్ లక్ష్మణ్ ల మాదిరిగానే ట్విన్స్. ప్రస్తుతం దేశంలో చాలా కాస్ట్లీ ఫైట్ మాస్టర్లు. వీరిని ఎంగేజ్ చేస్తే ఖర్చు ఓ రేంజ్ లో వుంటుందని టాక్. ఎందుకంటే వీరికి అంటూ ఓ స్పెషల్ చెఫ్. అతనికి ఓ కారు సమకూర్చాలి. వాళ్లకు వంట అతనే చేస్తాడు. ఆ ఖర్చు అంతా నిర్మాత భరించాలి. సరే అదంతా వేరే సంగతి.
మహేష్ బాబు భారీ యాక్షన్ సీన్లు చేయడం అంటే కొంచెం అనుమానమే. ఎందుకంటే ఆయన కాస్త సుకుమారంగా వుంటారని అందరూ అంటారు. తాళ్లు కట్టి, భారీ భారీ ఫైట్లు అంటే అంత సుముఖత వ్యక్తం చేయరు. రఫ్ అంట్ టఫ్ వ్యవహారం కాదు. మహర్షి సినిమాకు ఎండ కు కందిపోయి, అప్పటి కప్పుడు ఏసి ఫ్లోర్ లో పశువుల పాక సెట్ వేయించిన వైనం ఒకటి వుండనే వుంది. అలాంటిది ఇప్పుడు భారీ యాక్షన్ సీన్లు అంటే మరి ఏం జరిగిందో?
మొత్తానికి ఒకటిన్నర రోజుల్లోనే అన్నపూర్ణలో షూట్ ఆపేసారు. సోమవారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో షూట్ అన్నారు అదీ ఆపేసారు. ఫైట్ మాస్టర్లు వెనక్కు వెళ్లిపోయారు. హీరోకి ఫైట్ మాస్టర్ల తీరు నచ్చలేదని అందుకే వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ యూనిట్ మాత్రం అదేం లేదని, మూడు రోజులు అనుకున్న పని త్వరగా అయిపోయిందని, హీరో పార్ట్ ఫైట్ అయిపోయిందని, ఫైటర్ల పార్ట్ తరువాత తీద్దామని అనుకోవడంతో ఫైట్ మాస్టర్లు వెళ్లిపోయారని అంటోంది.
కానీ ఇన్ సైడ్ టాక్ వేరుగా వుంది. వ్యవహారం ఏదో నలుగుతోందని గ్యాసిప్ వినిపిస్తూనే వుంది.