మామంగం..ఆసక్తి రేపుతోంది

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ మాంచి గుణం వుంది. వైవిధ్యమైన సినిమా అయితే చాలు, టక్కున పట్టేసుకుని, హత్తేసుకుంటారు. అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? ఏ భాష నుంచి డబ్ అయింది అన్నది…

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ మాంచి గుణం వుంది. వైవిధ్యమైన సినిమా అయితే చాలు, టక్కున పట్టేసుకుని, హత్తేసుకుంటారు. అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? ఏ భాష నుంచి డబ్ అయింది అన్నది కూడా అనవసరం.  ఎన్నో ఏళ్లుగా ఈ పాయింట్ రుజవు అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్నవచ్చిన ఖాకీ, ఖైదీ సినిమాలతో సహా ఎన్నో వున్నాయి ఇలాంటి సినిమాలు. 

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తెలుగు వారికి కొత్త కాదు. ఒకప్పుడు కంకణం, సామ్రాజ్యం వంటి హిట్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమై స్వాతికిరణం లాంటి డైరక్ట్ సినిమా చేసారు. అది చేసిన రెండు దశాబ్ధాల తరువాత యాత్ర సినిమాతో మళ్లీ తనేంటో, తన నటన ఏంటో మరోసారి చూపించారు. 

అలాంటి మమ్ముట్టి హీరోగా మలయాళంలో తయారైన భారీ, పీరియాడిక్ మూవీ మమ్మాంగం. 17-18 శతాబ్దకాలం నాటి పరిస్థితులు, అప్పట్లో జరిగే ఓ ఉత్సవం నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా అల్లిన కథతో ఈ భారీ సినిమాను రూపొందించారు. మలయాళంలో ఇంత భారీ సినిమాలు అన్నవి అరుదుగా వస్తుంటాయి. మమ్మాంగం సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

సినిమా విజువల్స్, భారీ తనం, కథాశం అన్నీ చూసి గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. డిసెంబర్ 12న విడుదల కాబోతున్న సినిమా ట్రయిలర్ వచ్చింది. ట్రయిలర్ లో పరిచయం వున్న మొహాలు తక్కువే కానీ, సినిమా కథాంశం, భారీతనం మాత్రం చూపుతిప్పుకోకుండా చేస్తాయి.

వైవిధ్యమైన సినిమాల కోసం ఎదురు చూసే తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి రేపుతోందీ సినిమా. డిసెంబర్ రెండో వారంలో విడుదలకు రెడీ అవుతోంది.