అధికారిక బయోపిక్ కాదు కానీ, అనధికారికంగా తమిళనాడు రాజకీయాల్లో మూలస్తంభాల్లాంటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత జీవితాల ఆధారంగా రూపొందిన తమిళ సినిమా 'ఇద్దరు'. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్యరాయ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అయితే కాదు. అయితే అత్యున్నత స్థాయి నటనా ప్రమాణాలకూ నిలువుట్టద్దంలా నిలుస్తుంది ఈ సినిమా. అలాగే నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రీకరణ, భావోద్వేగాలను ఆవిష్కరించడంలో కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా లో ఎంజీఆర్ పాత్రకు చక్కగా ప్రదర్శించాడు మోహన్ లాల్. ఇక కరుణానిధి పాత్రను ప్రకాష్ రాజ్ పండించాడు. అయితే వాస్తవానికి ముందుగా కరుణ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకోలేదట. ఆ పాత్రకు ముందుగా మణిరత్నం అనుకున్నది మమ్ముట్టీనట. మోహన్ లాల్, మమ్ముట్టీల కాంబినేషన్లో ఆ సినిమాను రూపొందించాలని మణిరత్నం భావించాడు.
ఆ మేరకు ఇద్దరినీ సంప్రదించారట. మోహన్ లాల్ ఓకే అన్నాడు కానీ, మమ్ముట్టీ ముందుకు రాలేదు. అప్పటికే మణిరత్నం దర్శకత్వంలో దళపతి సినిమాలో నటించాడు మమ్ముట్టీ. అయితే ఇద్దరు విషయంలో మాత్రం ముందుకు రాలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని మమ్ముట్టీనే ధ్రువీకరించాడు. కరుణానిధి మరణించిన సమయంలో .. ఇద్దరు ప్రస్తావన తీసుకువచ్చాడు మమ్ముట్టీ. తను కరుణ పాత్రను చేయాల్సిందని, అయితే మిస్ అయ్యానంటూ మమ్ముట్టీ చెప్పాడు.
మమ్ముట్టీ కాదన్నాకా.. ఆ పాత్ర కు చాలా మందిని అనుకున్నారట మణిరత్నం. కమల్, శరత్ కుమార్, నానా పటేకర్, సత్యరాజ్ వంటి వాళ్లను సంప్రదించాడట. చివరకు ఆ పాత్ర ప్రకాష్ రాజ్ కు దక్కింది. అప్పటికే మణిరత్నం దర్శకత్వంలో బొంబాయి వంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఇద్దరు కమర్షియల్ సక్సెస్ కాకపోయినా… నటుడిగా ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ సినిమా తర్వాతే అతడి కెరీర్ పతాక స్థాయికి చేరడం ప్రారంభం అయ్యింది.