బీజేపీ నేతల హిందుత్వ వాదంలో ఇదో పరాకాష్ట. ఏపీలో వినాయచవితి సామూహిక మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంలో రాజకీయం కోసం ఏపీ బీజేపీ నేతలు చాలా కష్టపడుతున్నారు పాపం. ఇందులో ఏమైనా వాటా దక్కుతుందేమో అని తెలుగుదేశం, జనసేనలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే ఎవరెక్కువ మాట్లాడితే వారికే రాజకీయ ప్రయోజనం అని లెక్కలేశారో ఏమో, కమలం పార్టీ నేత సోము వీర్రాజు తిరుపతి శ్రీవారి ఆలయ దర్శనాలకూ, వినాయక చవితికి అనుసంధానం చేస్తూ మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యే చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోందని.. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులను ఇవ్వడం లేదని… అంటే తిరుపతి ఆలయం తెరిస్తే హుండీ ఆదాయం వస్తుంది కాబట్టే… ఆలయాన్ని తెరవడానికి పర్మిషన్ ఇచ్చారా? అని ఈ బీజేపీ నేత ప్రశ్నించారు! ఏ కమ్యూనిస్టు పార్టీ నేతో రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తుతూ ఇలా మాట్లాడారంటే అదో లెక్క. అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరవడాన్ని కేవలం హుండీ ఆదాయంతో ముడి పెట్టారు వీర హిందుత్వవాది సోము వీర్రాజు!
అంటే.. వడ్డీకాసులవాడికి భక్తులు చెల్లించుకునే ముడుపులను అవమానించడం కాదా? ఇది? ఇదే మాటే మరొకరు మాట్లాడి ఉంటే.. వీర హిందుత్వ వాదులు ఏమనేవారు? అవతల మహారాష్ట్రలో హిందూ దేవాలయాలను తెరవాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఏపీలో తిరుమల ఆలయాన్ని టీటీడీ తెరిస్తే.. ఆదాయం కోసమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ బీజేపీ బాధ ఏమనుకోవాలి?
అయినా శ్రీవారి హుండీలో పడే డబ్బును ప్రభుత్వం తీసేసుకుంటుందా? టీటీడీ బోర్డు లేదా? టీటీడీ చేపడుతున్నా ధార్మిక కార్యక్రమాలు లేవా? ఆలయం తెరవడం అంటే.. ప్రభుత్వ ఆదాయం కోసమా అని ప్రశ్నించేంత స్థాయికి బీజేపీ నేతలు దిగజారడం నిజంగా హేయం. అంటే కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ఆలయాన్ని మూసేస్తేనే బీజేపీకి ఆనందం కాబోలు. ప్రతి అంశాన్నీ రాజకీయ, ఆర్థిక కోణంలో మాత్రమే బీజేపీ నేతలకు చూడటం అలవాటుగా మారి, మొద్దుబారిపోయినట్టుగా ఉన్నారు.
ఆఖరికి హుండీలోకి భక్తులు తమ సెంటిమెంట్లతో ముడిపెట్టి చెల్లించుకునే కానుకలను కూడా రాజకీయ కోణంలోకి లాగి.. శ్రీవారి ఆలయాన్ని తెరవడం కూడా పక్కా కమర్షియల్ వ్యవహారం అన్నట్టుగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆలయాన్ని తెరవడం, భక్తులకు పర్మిషన్లను ఇవ్వడంలో ప్రభుత్వం లెక్కలు ఏమున్నా… బీజేపీ నేతల మాటలు మాత్రం చాలా యాంటీ సెంటిమెంట్ గా, ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిచడం లో భాగంగా.. భక్తుల సెంటిమెంట్ ను, వారి అంచంచలమైన విశ్వాసాన్ని కూడా చాలా తేలిక చేసేలా, కించపరిచేలా ఉన్నాయి. వెంకన్న దర్శనంలో భక్తులు పొందే తన్మయత్వాన్ని పక్కన పెట్టేసి, బీజేపీ నేతల కన్ను మాత్రం హుండీ మీద మాత్రమే ఉన్నట్టుగా ఉంది.