నెల్లూరులో సోమశిల రిజర్వాయర్ గేట్లు ఎత్తారు. మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో విశేషం ఏమీ లేదు. పెన్నాకు వరదలొచ్చాయి, సోమశిల రిజర్వాయర్ నిండింది, మంత్రి, అధికారులు వచ్చి గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేశారు. అయితే అక్కడే ఉంది చిన్న ట్విస్ట్.
సహజంగా ఏ కార్యక్రమానికైనా సంబంధిత శాఖ మంత్రి ముఖ్య అతిథిగా వెళ్తారు. రిజర్వాయర్ గేట్లు ఎత్తాలంటే ప్రోటోకాల్ ప్రకారం జలవనరుల శాఖ మంత్రి రావాల్సి ఉంటుంది. అందులోనూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా వారే. నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ గేట్లు ఎత్తే కార్యక్రమంలో మంత్రి అనిల్ లేరు. పోనీ ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు.. మరో మంత్రి, ఇతర నేతలు వస్తున్నారని వివరణ ఏమైనా ఉందా అంటే అదీ లేదు.
మంత్రి పరోక్షంలో జరిగిన ఈ కార్యక్రమం గురించి మీడియాకు సమాచారం ఉన్నా.. అనిల్ ఎందుకు రాలేకపోతున్నారని మాత్రం అధికారులు చెప్పలేదు. కనీసం ఆ కార్యక్రమానికి వచ్చిన మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ ఆ విషయంపై పెదవి విప్పలేదు.
ఇంతకీ అనిల్ ఏమయ్యారు..?
మంత్రి అనిల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. కొన్నిరోజులు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన, ఇటీవల విజయవాడకు షిఫ్ట్ అయ్యారు. చెన్నై ఆస్పత్రికి కూడా వెళ్తారని చెప్పినా.. ఆయన ప్రస్తుతం విజయవాడలోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మంత్రి అనారోగ్యంగా ఉంటే ఒకటి రెండురోజులు ఇన్ఫర్మేషన్ లేకపోయినా పర్లేదు, కానీ వారం దాటినా ఎక్కడా ఆ విషయం బయటకు పొక్కలేదు, అసలు అనిల్ కి ఏమైంది? ఆయన ఎందుకు బయట కనిపించడం లేదు. నిజంగానే ఆయన ఆరోగ్యం బాగాలేదా? లేక ఏదైనా వివాదంలో చిక్కుకున్నారా..? ఈ విషయాలపై మీడియాకు సమాచారమే లేదు.
నెల్లూరులో ఏం జరుగుతోంది..?
నెల్లూరులో మంత్రి అనిల్ కు చెక్ పెట్టడానికి స్థానిక నాయకులు ఓ గ్రూపుగా ఏర్పడ్డారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీలో తమ ఫ్యామిలీకి ఇంకా పట్టు ఉందని, సిటీలో కచ్చితంగా తాము గడప గడపకు వెళ్తామని ఆమధ్య ఆనం రామనారాయణ రెడ్డి కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఆ తర్వాత నెల్లూరు సిటీలో ఫ్లైఓవర్ ఏర్పాటు సందర్భంగా ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో ఆనం కుటుంబానికి, అనిల్ కి మధ్య వైరం మరింత పెరిగింది.
ఇక లోకల్ గా మరికొంతమంది ఎమ్మెల్యేలకు కూడా అనిల్ తో పొసగడంలేదని సమాచారం. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నెల్లూరు వచ్చి చిన్న పంచాయితీ చేసి వెళ్లారు. తాజాగా.. అనిల్ లేకుండానే సోమశిల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, అందులోనూ ఆయన ప్రస్తావన లేకపోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతున్నాయి.