మనమే.. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు సడెన్ గా విడుదల తేదీ (జూన్ 7) ఫిక్స్ చేశారు. ఉన్నది 2 వారాలే. ఈ గ్యాప్ లోనే ప్రచారం చేయాలి. బ్యాలెన్స్ వర్క్ పూర్తిచేయాలి. ఈ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా యూనిట్ లో అందరికీ కీలకమే.
అందరికంటే ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టికి ఇది పెద్ద పరీక్ష. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలొస్తాయి. లేదంటే ఆమె కెరీర్ మరింత మసకబారడం ఖాయం. కస్టడీ, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులిచ్చింది కృతి. మనమే సినిమా హిట్టవ్వడం ఆమెకు అత్యవసరం.
ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. లైమ్ లైట్లోకి రావాలన్నా, హిట్ దర్శకుడు అనిపించుకోవాలన్నా, ఈ సినిమా సక్సెస్ ఇతడికి చాలా ఇంపార్టెంట్. అప్పుడెప్పుడో దేవదాస్ సినిమా తీశాడు, ఆ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి హీరో అనే సినిమా తీశాడు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘మనమే’ అంటూ మనముందుకొస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా ఈ సక్సెస్ కీలకం. డబ్బులు పెడుతున్నారు, వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు కానీ ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. రామబాణం, ఈగల్ లాంటి సినిమాలు ఈ బ్యానర్ ను కాస్త ఇబ్బంది పెట్టాయి.
అటు శర్వానంద్ కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత ఏరికోరి మరీ ఈ స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకున్న శర్వా, తన సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలనుకుంటున్నాడు.