విశాఖ స్టీల్ ప్లాంట్ అక్షరాల బలిపీఠం మీద ఉంది. జూన్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సగం వేతనాలను చెల్లిస్తూ పస్తులు పెడుతున్నారు. ప్లాంట్ లోని కీలక విభాగాలను కూడా మూత పడేలా చేస్తున్నారు.
ఇదంతా కావాలని కేంద్రం చేస్తోంది అని ఉద్యమకారులు ఆరోపిస్తున్న నేపధ్యం ఉంది. ఈ నేపధ్యంలో వేల కోట్ల రూపాయలు విశాఖ ప్లాంట్ కి కేటాయించే ఉదారత కేంద్రానికి ఉందా అన్నదే పాయింట్. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకై రూ.3,110 కోట్ల ఆర్థిక సహాయం కోసం బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్‌తో భేటీ అయి స్టీల్ ప్లాంట్ ఎంతలా చిక్కి శల్యం అయిందో వివరించారు.
జీవీఎల్ చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆర్థిక కార్యదర్శి హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అందువల్ల ఇంత పెద్ద మొత్తం విడుదల చేయాలంటే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే.
దాంతో బీజేపీ అధికారంలోకి వస్తే ఒకలా ఇండియా కూటమి వస్తే మరోలా స్టీల్ ప్లాంట్ జాతకం ఉంటుందని అంటున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు అయితే ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తారు. కానీ విధానపరంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలన్నదే బీజేపీ ఆలోచన అయినపుడు అదే పార్టీకి చెందిన జీవీఎల్ కోరినా మరొకరు అడిగినా నిర్ణయం అయితే మారదు అంటున్నారు.
పైగా ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం అని కేవలం ఒక్క స్టీల్ ప్లాంట్ కోసం పక్కన పెట్టడం కానీ సవరించడం కానీ జరగదు అంటున్నారు. ఒకవేళ కనుక కేంద్రం దయదలచి మూడు వేల కోట్ల నిధులు ఇస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ పునర్జన్మ ఎత్తినట్లే అంటున్నారు.