టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత ఎక్కడ అని అంతా ఆలోచిస్తున్నారు. ఇదే ప్రశ్నను మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వేశారు. ఎన్నికల ప్రచారంలో ఏపీలో ఊరూర తిరిగి హోరెత్తించిన ఈ ఇద్దరు నేతలూ ఇపుడు ఎక్కడ అని ఆయన నిలదీస్తున్నారు.
వారు ఎక్కడ ఉన్నారో సొంత పార్టీ వారికైనా తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నాయకుడు జగన్ దర్జాగా చెప్పి విదేశీ పర్యటనకు వెళ్లారని ఆయన అంటున్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు మాత్రం ఎవరికీ చెప్పకుండానే వెళ్లారని ఆయన విమర్శించారు. పవన్ సైతం ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు అన్నారు.
తాము ఏమి చేసినా పారదర్శకంగా ఉంటుందని అందుకు తమ అధినేత వైఖరే నిదర్శనం అన్నారు. తమ నాయకుడు విదేశాలకు వెళ్ళేముందు వైసీపీకి వచ్చే సీట్లు ఎన్నో చెప్పి వెళ్ళారని గుర్తు చేశారు. తాము ఫేక్ సర్వేలు నమ్మడం లేదని జనాలనే నమ్ముకున్నామని ఆయన అన్నారు.
ప్రజలు వైసీపీని మనసారా ఆశీర్వదించారని, అందువల్ల ఈసారి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామని అన్నారు. విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకుని గత ఫలితాలను రిపీట్ చేస్తుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న అంతా విశాఖ వైపు చూడాల్సిందే అని ఆ రోజున జగన్ సీఎంగా రెండవసారి బాధ్యతలు స్వీకరిస్తారు అని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
వాలంటీర్ల వ్యవస్థతో పాటు సచివాలయాలు సంక్షేమ పధకాలు, తాము చేసిన అభివృద్ధిని చూసి జనాలు ఓటేశారు అని నమ్ముతున్నామని ఆయన అన్నారు. తమ పధకాలను కార్యక్రమాలను అన్నీ అడ్డుకున్న విపక్షాల వైపు జనాలు ఎందుకు ఉంటారని బొత్స అంటున్నారు రాష్ట్రంలో దాడులు ఘర్షణలు ఎన్నడూ లేవని దానిని తమ పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. వీటిని ప్రజలు కూడా కోరుకోరని ఆయన పేర్కొన్నారు.