విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ భయపడ్డట్టే జరగనుందా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ‘మా’ బైలాస్ మార్పుపై నూతన అధ్యక్షుడు మంచు విష్ణు నోరు విప్పారు. బైలాస్ మారుస్తానని ఆయన తేల్చి చెప్పారు.
ఇక్కడే అసలు ట్విస్ట్. తెలుగు నటులు కాని వారిని ‘మా’ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మంచు విష్ణు మార్చనున్నారని ఇటీవల ప్రకాశ్‌రాజ్ సంచలన ఆరోపణ చేశారు. అందువల్లే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు.
తాను ఓటరుగానో, మరెవరినో గెలిపించడానికో ‘మా’లో ఉండనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మంచు విష్ణు అభ్యర్థనపై కూడా ప్రకాశ్‌రాజ్ ఇటీవల స్పందించారు. తెలుగేతర నటులు ‘మా’లో పోటీకి అనర్హులనే బైలాస్‌ను మార్చనని విష్ణు హామీ ఇస్తే… రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకాశ్‌రాజ్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా బైలాస్ మార్పుపై తిరుపతి పర్యటనలో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. శ్రీ విద్యానికేతన్‌లో మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ ఏ పోటీలోనైనా గెలుపోటములు సర్వసాధారణమన్నారు. ఈ సారి తాము గెలిచామన్నారు. వాళ్లు ఓడిపోయారన్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ వాళ్లు తర్వాత గెలవొచ్చన్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరిగాయని మంచు విష్ణు అంగీకరించారు. ఆ విషయంలో ఇరువైపులా తప్పు జరిగిందన్నారు.
చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్ మార్చాలనుకుంటున్నట్టు మంచు విష్ణు బాంబు పేల్చారు. అది కూడా సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదని తాను భావిస్తున్నట్టు విష్ణు తెలిపారు.
ఎవరంటే వాళ్లు అని విష్ణు అనడం వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. తెలుగేతర నటులు కేవలం మాలో సభ్యత్వానికి మాత్రమే అర్హులని, పోటీకి కాదని బైలాస్ మారుస్తారనే ప్రచారానికి మంచు విష్ణు అభిప్రాయాలు ఊతం ఇస్తున్నాయి.