చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నారు

మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతను మన్సూర్ అలీఖాన్ నిజం చేసి చూపిస్తున్నాడు. త్రిషపై అతడు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని చిరంజీవి తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూకు సంబంధించి త్రిషకు బహిరంగంగా చిరంజీవి…

మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతను మన్సూర్ అలీఖాన్ నిజం చేసి చూపిస్తున్నాడు. త్రిషపై అతడు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని చిరంజీవి తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూకు సంబంధించి త్రిషకు బహిరంగంగా చిరంజీవి తన మద్దతు తెలిపారు. అది జరిగిన కొన్ని రోజులకే మన్సూర్ అలీఖాన్, త్రిషకు క్షమాపణలు చెప్పాడు.

అక్కడితో గొడవ అయిపోయిందనుకున్నారంతా. కానీ అసలు మేటర్ ఆ తర్వాతే మొదలైంది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ పరువు నష్టం దావా వేశాడు మన్సూర్. కేవలం త్రిషపైనే కాకుండా, ఆమెకు మద్దతుగా నిలిచిన ఖుష్బూ, చిరంజీవిపై కూడా దావా వేశారు. దీనికి సంబంధించి మన్సూర్ తరఫు లాయర్ గురు ధనుంజయ్ ఏర్పాట్లు చేస్తున్నాడు.

త్రిషపై కోపం చిరంజీవిపై… వివాదానికి అసలు కారణమైన త్రిషను పల్లెత్తు మాట అనలేదు మన్సూర్. ఆమెకు మద్దతుగా నిలిచిన ఖుష్బూ, చిరంజీవిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. త్రిష, ఖుష్బూపై చెరో 10 కోట్ల రూపాయలకు.. చిరంజీవిపై ఏకంగా 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

చిరంజీవి పార్టీ పెట్టి, వేల కోట్లు మింగేసి పేదలకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. ఆయన తమ్ముడు పవన్ కూడా పార్టీ పెట్టాడని, పవన్ ను తను ఎప్పుడూ కలవనప్పటికీ, పార్టీ పెట్టిన అన్నదమ్ములిద్దరూ ప్రజల కష్టాలు తీర్చడం లేదని ఆరోపించారు.

ఇక ఏటా చిరంజీవి ఇచ్చే పార్టీలపై కూడా సెటైర్లు వేశాడు మన్సూర్. ప్రతి సంవత్సరం, పాత హీరోయిన్లకు చిరంజీవి పార్టీ ఇస్తారని, కేవలం ఆయన హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తారని కామెంట్ చేశారు. హీరోయిన్లకు పార్టీలు ఇచ్చే చిరంజీవి, తాజా వివాదానికి సంబంధించి తనకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని ఆరోపించారు.

చిరంజీవి నుంచి పరువు నష్టం దావా కింద తనకు 20 కోట్ల రూపాయలు వస్తే, ఆ మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు మన్సూర్. తన ఆత్మసాక్షిగా, తను వృత్తిపై ప్రమాణం చేస్తూ ఈ మాట చెబుతున్నానని, పరువు నష్టం సొమ్ము మొత్తం పేదలకు పంచిపెడతానని అన్నాడు.

రేప్ వ్యాఖ్యలతో రేగిన దుమారం.. ఈ మొత్తం వివాదానికి కారణం త్రిషపై మన్సూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. లియో సినిమాలో త్రిష ఉందని తెలియగానే, తనపై ఓ రేప్ ఉంటుందని, అమాంతం ఆమెను తీసుకెళ్లి మంచంపై పడేసి రేప్ చేసే సీన్ ఉంటుందని మన్సూర్ అనుకున్నాడట. తను గతంలో అలాంటి సీన్లు చాలా చేశానని, లియో కూడా ఉంటుందని అనుకున్నానని అన్నాడు.

ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. చిరంజీవితో పాటు చాలామంది ప్రముఖులు మద్దతిచ్చారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. మన్సూర్ పై కేసు పెట్టాలంటూ తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. మరోవైపు నడిగర్ సంఘం కూడా మన్సూర్ పై తాత్కాలికంగా వేటు వేసింది.

ఇలా అత్యంత వివాదాస్పదమవ్వడంతో మన్సూర్, త్రిషకు క్షమాపణలు చెప్పారు. అయితే ఆ వెంటనే తన పరువుకు భంగం కలిగిందంటూ త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువు నష్టం దావాకు సిద్ధపడ్డారు. చిరంజీవిపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.