తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఉపాధ్యాయ సంఘం పోస్టల్ బ్యాలెట్ల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే తెలంగాణలో 1.40 లక్షల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అందలేదనే విమర్శ వుంది. దీంతో అలాంటి ఉపాధ్యాయులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విశేషం.
ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఇంత కాలం చెలామణి అవుతూ వచ్చింది. ఏపీలో మాత్రం జగన్ సర్కార్‌పై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ సర్కార్‌పై ఉద్యోగుల్లో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని చూపేందుకు మీడియా భయపడిందనే వాస్తవం ఇప్పుడిప్పుడే బయడపడుతోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో కోపం వుందనే ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు అంగీకరించడం లేదు. ఉద్యోగులు తమ వైపే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.
కేవలం ఉద్యోగుల్లోనే కాదని, తెలంగాణ సమాజంలో కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేయడంలో ఇబ్బంది పెట్టడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో భయం కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. డిసెంబర్ 3న ఎవరి వాదనలో పస వుందో తేలిపోనుంది. అంత వరకూ ఉత్కంఠ తప్పదు.