40 శాతం ఓటు బ్యాంక్ కలిగిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేశ్ వారసుడు. కాలం కలిసొస్తే ముఖ్యమంత్రి కావాలని లోకేశ్ ఆశ పడుతున్నారు. అలాంటి లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆరు శాతం ఓటు బ్యాంక్ కలిగిన జనసేనాని పవన్‌కల్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని నినదించడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ధోరణి టీడీపీ రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి గోదావరి జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం అంతోఇంతో బలంగా ఉన్న ప్రాంతం. అయితే మిగిలిన సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకుని రాజకీయ అడుగులు వేయాల్సి వుంటుంది. ఈ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు పార్టీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్టున్నాయి. పవన్‌కు జైకొడితే, కాపులు సంతోషిస్తారని, తద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చనే చిల్లర సలహా ఎవరో ఇచ్చారు.
ముందూవెనుకా ఆలోచించకుండా పవన్‌కు లోకేశ్ జైకొట్టారు. చంద్రబాబుతో సమానంగా పవన్‌ను ట్రీట్ చేయడం ద్వారా టీడీపీ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నానన్న స్పృహ కోల్పోవడం గమనార్హం. బాబుతో సమానంగా పవన్‌ను చిత్రీకరించడం ద్వారా భవిష్యత్‌లో తలెత్తనున్న ప్రమాదాన్ని గుర్తించినట్టు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబుతో తమ నాయకుడు సమానమని జనసేన నాయకులు భావించి, అందుకు తగ్గట్టు సీట్లలో వాటా కోరుతారు.
అలాగే అధికారంలో భాగస్వామ్యం కూడా కోరుతారు. ఐదేళ్లలో సగం కాలం పవన్ పాలిస్తాడనే డిమాండ్‌ను తీసుకురారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే పవన్‌కల్యాణ్ లేకపోతే, టీడీపీకి భవిష్యత్ లేదని జనసేన నమ్ముతోంది. టీడీపీ బలహీనంగా ఉందని పవన్‌కల్యాణ్ చెప్పడాన్ని మరిచిపోవద్దు. ఒక్కసారి పవన్‌ను నెత్తిన ఎక్కించుకున్న తర్వాత , దించడం తమ చేతల్లో వుండదని టీడీపీ ఎలా విస్మరించిందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి.
పవన్ శక్తికి మించి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనపడడం టీడీపీకి ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో తాత్కాలికంగా పవన్‌తో సాయం పొంది పబ్బం గడుపుకుందామని టీడీపీ ఎత్తుగడ వేసినా, ఆచరణకు వచ్చే సరికి అలా వుండదు. ఒక్కసారి గుర్తింపునకు రుచి మరిగిన తర్వాత, ఇంకో రకంగా ట్రీట్ చేస్తామంటే ఒప్పుకోరు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టుగా భావించి, రివర్స్ అయ్యే ప్రమాదం వుంది. అంతేకాదు, పవన్ నాయకత్వం వర్ధిల్లాలని లోకేశ్ నినదించడం ద్వారా, యువనాయకుడు తనకు తానుగా స్థాయిని దిగజార్చుకున్నట్టే.
అంతెందుకు, ప్రధాని మోదీకి పవన్ జై కొట్టడం చూశాం. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని పవన్ నినదించడం చూశామా? ఆ పాటి విజ్ఞత టీడీపీ నేతల్లో ఎందుకు కొరవడిందనేదే ఇప్పుడు ప్రశ్న. అందుకే పవన్‌కు లోకేశ్ జై కొట్టడాన్ని టీడీపీ శ్రేణులు ఛీత్కరిస్తున్నాయి.