మంత్రి ముందు కళ్లనీళ్లు

థియేటర్ల టికెట్ ల సమస్య కాస్త తీవ్రంగానే వున్నట్లు కనిపిస్తోంది. ఈరోజు టాలీవుడ్ ప్రతినిధులకు, మంత్రి పేర్నికి నడుమ జరిగిన చర్చా సమావేశంలో ఓ ఎగ్జిబిటర్ కళ్లనీళ్లు పెట్టుకుని, భోరున విలపించినట్లు తెలుస్తోంది. ఈ…

థియేటర్ల టికెట్ ల సమస్య కాస్త తీవ్రంగానే వున్నట్లు కనిపిస్తోంది. ఈరోజు టాలీవుడ్ ప్రతినిధులకు, మంత్రి పేర్నికి నడుమ జరిగిన చర్చా సమావేశంలో ఓ ఎగ్జిబిటర్ కళ్లనీళ్లు పెట్టుకుని, భోరున విలపించినట్లు తెలుస్తోంది. ఈ రేట్లతో ఈ పరిస్థితుల్లో థియేటర్ రన్ చేయలేం సార్ అని చెబుతూ, ఎమోషనలై, కళ్ల నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

టాలీవుడ్ ప్రముఖులు, యువి వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి కళ్యాణ్, దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, వెస్ట్ ఎల్వీఆర్, ఈస్ట్ సత్యనారాయణ, వైజాగ్ వీర్రాజు, దామోదరప్రసాద్, విజయవాడ అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబు తో సహా పలువురు థియేటర్ యజమానులు కూడా మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

ముందుగా 100శాతం ఆక్యుపెన్సీ, అలాగే సెకెండ్ షో లకు అనుమతి ఇవ్వమని మంత్రిని కోరారు. సిఎమ్ తో మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు వచ్చేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. టికెట్ ఆన్ లైన్ అన్నది తప్పని సరి వ్యవహారం అని మంత్రి స్పష్టం చేసారు. దానికి ప్రతినిధులు కూడా ఓకె అన్నారు. ఆన్ లైన్ కు టాలీవుడ్ లో ఏ ఒక్కరు వ్యతిరేకం కాదని మంత్రికి స్పష్టం చేసారు.

అయితే టికెట్ రేట్లను ఫ్లెక్సీ రేట్లుగా మార్చాలని 50 నుంచి 250 మధ్యన వుండేలా ఫ్లెక్సీ రేట్లు ఇవ్వాలని, అప్పుడు సినిమాకు, కలెక్షన్లకు అనుగుణంగా తాము రేట్లు మార్చుకుంటామని ప్రతినిధులు కోరారు. దానికి మంత్రి ఈ విషయం సిఎమ్ దృష్టికి తీసుకెళ్లానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.