మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ.. మేజిక్ మిస్సయింది

గతేడాది మార్చి నెలలో ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అంతకుముందు ఏడాది జాతిరత్నాల్లాంటి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. ఆ మేజిక్ ను ఈ ఏడాది మార్చి నెల మాత్రం…

గతేడాది మార్చి నెలలో ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అంతకుముందు ఏడాది జాతిరత్నాల్లాంటి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. ఆ మేజిక్ ను ఈ ఏడాది మార్చి నెల మాత్రం రిపీట్ చేయలేకపోయింది.

బలగం సినిమాతో మార్చి నెలకు మంచి ఓపెనింగ్ దక్కింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకుల్ని కదిలించింది. తెలంగాణ నేపథ్యంలో, చావు చుట్టూ అల్లిన ఈ కథ ప్రతి ఒక్కర్ని కదిలించింది. ఇన్నాళ్లూ హాస్యనటుడిగా అందరికీ తెలిసిన వేణు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

బలగంతో పాటు వచ్చిన మరో మూవీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పస లేని కామెడీ, ఆకట్టుకోని కథనం ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్స్. ఈ మూవీస్ తో పాటు వచ్చిన గ్రంథాలయం, రిచి గాడి పెళ్లి, ఇన్ కార్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక రెండో వీకెండ్ ఆర్ఆర్ఆర్ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఆస్కార్ బరిలో నిలవడంతో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాను మరోసారి లిమిటెడ్ గా రిలీజ్ చేశారు. అయితే ఈసారి పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాతో పాటు వచ్చిన ఆది సాయికుమార్ సీఎస్ఐ సనాతన్ అట్టర్ ఫ్లాప్ అయింది. నేడే విడుదల, మిస్టర్ కల్యాణ్, దోచేవారెవరు లాంటి మిగతా సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

మూడో వారంలో.. కబ్జా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కేజీఎఫ్ స్ఫూర్తితో, పూర్తిగా ఆ సినిమాను కాపీ కొడుతూ కబ్జా తీశారు. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఫ్లాప్ అయింది. దీనికితోడు ఫేక్ కలెక్షన్లతో వేసిన పోస్టర్లతో ఈ సినిమా మరింతగా పరువు పోగొట్టుకుంది. ఇక నాగశౌర్య-అవసరాల కాంబోలో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా ఫ్లాప్ అయింది. కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో హ్యాట్రిక్ కొట్టే అవకాశం చేజార్చుకున్నారు శౌర్య-అవసరాల.

నాలుగో వారంలో రంగమార్తాండ, దాస్ కా ధమ్కీ సినిమాలు పోటీ పడ్డాయి. సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే థియేటర్లలో వాష్ అవుట్ అయింది. విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమాకు భారీ ప్రచారం కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అదే ఊపులో బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ అనిపించుకుంది. ఈ వారం వచ్చిన కోస్టి, గీతసాక్షిగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక మార్చి నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ రిలీజైంది దసరా సినిమా. నాని హీరోగా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కు మొదటి రోజు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా రేంజ్ ఏంటో చెప్పాలంటే, కనీసం ఈ వీకెండ్ గడవాలి. ఈ మూవీతో పాటు వచ్చిన పరారీ, సత్యం వథ ధర్మం చెర, వీరఖడ్గం, ఏజెంట్ నరసింహా లాంటి సినిమాలన్నీ వాష్ అవుట్ అయ్యాయి.

ఓవరాల్ గా మార్చి నెలలో అటుఇటుగా 25 సినిమాలు రిలీజ్ అవ్వగా.. బలగం, దాస్ కా థమ్కీ సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. దసరా రేంజ్ ఏంటనేది ఏప్రిల్ నెలలో తేలుతుంది.