నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది సమంత. విడాకుల తర్వాత ఓ మహిళకు ఎంత అవమానాలు ఎదురవుతాయో, పాపులర్ పర్సనాలిటీ అయిన సమంత అంతకంటే ఎక్కువగానే ట్రోలింగ్ ఫేస్ చేసింది. అయితే ఎక్కడా ఆమె సంయమనం కోల్పోలేదు. నాగచైతన్యకు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వలేదు.
తొలిసారి తన శైలికి భిన్నంగా సమంత స్పందించింది. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా తన విడాకులపై మాట్లాడిన ఆమె, తను తప్పేం చేయలేదంది, వైవాహిక బంధానికి సంబంధించి తను వందశాతం నిజాయితీగా ఉన్నానని, రిలేషన్ షిప్ కు అంకితమయ్యానని చెప్పుకొచ్చింది.
ఇలా తమ విడాకులపై సమంత కాస్త ఘాటుగా స్పందించింది. అయితే ఆమె స్పందించిన టైమింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. నాగచైతన్య-శోభిత డేటింగ్ పై పుకార్లు గుప్పుమంటున్న వేళ, సమంత ఇలా రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
సమంత-చైతూ విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతోంది. వాళ్లు ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్. దానిపై ఇప్పటివరకు ఎలాంటి లీకులు లేవు. మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తప్పంతా సమంతదే అన్నట్టు సోషల్ మీడియాలో నానా హడావుడి చేశారు. సమంతకు, ఆమె స్టయిలిస్ట్ కు లింక్ పెట్టే ప్రయత్నాలు కూడా అప్పట్లో జరిగాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది సమంత.
కట్ చేస్తే, ఇప్పుడు నాగచైతన్యపై రూమర్లు నడుస్తున్నాయి. శోభిత ధూళిపాలతో అతడు డేటింగ్ చేస్తున్నాడంటే పుకార్లు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి రహస్యంగా లండన్ కూడా వెళ్లి, చక్కర్లు కొట్టి వచ్చారనే టాక్ ఉంది. దానికి మరింత ఊతమిస్తూ.. తాజాగా ఓ చెఫ్ తో చైతూ దిగిన ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటో వెనక కాస్త ముఖం కవర్ చేసుకుంటూ శోభిత కూడా ఉంది. అది లండన్ లో తీసిన ఫొటోనే.
ఈ ఫొటో ఇలా బయటకొచ్చిన వెంటనే అలా సమంత స్వరం మారింది. విడాకుల విషయంలో తన తప్పేం లేదన్నట్టు ఆమె ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టింది. దీంతో అన్ని వేళ్లు ఇప్పుడు నాగచైతన్య వైపు చూపిస్తున్నాయి. ఎప్పట్లానే చైతూ మౌనంగా ఉన్నాడు. సమంతతో విడిపోయినప్పుడు ఎలాగైతే సైలెంట్ గా ఉన్నాడో, ఇప్పుడు తనపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కూడా అదే నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు.