“వయ్యారి భామ.. నీ హంస నడక..” తమ్ముడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇది. కేవలం ఈ ఒక్క పాట కోసం ఓ స్పెషల్ లుక్ లో కనిపిస్తాడు పవన్ కల్యాణ్. అదొక రైల్వే కూలీ గెటప్. పక్కా మాస్ లుక్. మళ్లీ ఇన్నేళ్లకు ఆ గెటప్ ను రిపీట్ చేశాడు. బ్రో సినిమా కోసం తమ్ముడి సినిమాలో పాత గెటప్ ను బయటకు తీశాడు.
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది బ్రో సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు పవన్. పక్కనే ఉన్న సాయిధరమ్ తేజ్ కూడా అదే లుక్ లోకి మారాడు.
ఈ సినిమాలో దేవుడిగా కనిపించబోతున్నాడు పవన్ కల్యాణ్. కాకపోతే మోడ్రన్ దేవుడి పాత్ర అది. అందుకే ఇలా మాస్ లుక్ లోకి మారాడు 'దేవుడు' పవన్. అంతేకాదు, పనిలోపనిగా నోట్లో బీడీ కూడా పెట్టాడు.
బ్రో మూవీకి చాన్నాళ్ల కిందటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చేనెల 28న థియేటర్లలోకి వస్తోంది సినిమా. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ మాత్రం ఇంకా రాలేదు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే వాళ్లను మరీ ఎక్కువసేపు వెయిటింగ్ లో ఉంచకుండా ఇలా ఈ పోస్టర్ వదిలారు. టీజర్ త్వరలోనే వస్తోందంటూ ఎనౌన్స్ చేశారు. అయితే ఆ టీజర్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు.
సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది బ్రో. తమిళ్ లో వచ్చిన వినోదాయశితం సినిమాకు రీమేక్ ఇది. పవన్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ సబ్జెక్టును పూర్తిగా మార్చేశాడు రచయిత త్రివిక్రమ్. సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.