పీఓకేపై రాజ్‌నాథ్: ఇది ఎన్నికల అస్త్రమా?

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇప్పుడు తేనె తుట్టెను కదిపారు. ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తాము భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ను హెచ్చరిస్తూ…

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇప్పుడు తేనె తుట్టెను కదిపారు. ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తాము భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ను హెచ్చరిస్తూ ‘‘కాశ్మీర్ సంగతి మీరు పూర్తిగా మరిచిపోండి.. పిఓకే కూడా భారత్ లో కలవాలనుకుంటోంది’’ అని రాజ్‌నాధ్ అనడం ఇప్పుడు సంచలనం అవుతోంది. 

ఈ మాటలు పాకిస్తాన్ ను హెచ్చరించేవి మాత్రమే కాదని రెచ్చగొట్టేవి కూడా అని పలువురు భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం’’ అనే అంశాన్ని ప్రజల మీద బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతున్నదా అనే అనుమానాలను  పలువురు వ్యక్తం చేస్తున్నారు.

కాశ్మీర్లో 370 అధికరణం రద్దు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ రకరకాల విమర్శలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీనికి దీటుగా జవాబు ఇచ్చే ప్రయత్నంలో పిఓకేని కూడా తాము సొంతం చేసుకోగలం అని అర్థం ధ్వనించేలా రాజనాధ్ సింగ్ ఈ మాటలు చెబుతున్నారు.

పాకిస్తాన్ తో సంబంధాల విషయంలో ఉండే సున్నితమైన ఎమోషనల్ అంశాలను రాజకీయంగా వాడుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు- అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కార్గిల్ వ్యవహారాన్ని వాడుకొని ఒకసారి, సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని వాడుకొని మరొకసారి భారతీయ జనతా పార్టీ రాజకీయంగా లబ్ధి పొందిందని.. ఈసారి అలాంటి సున్నితమైన అంశం మరొకటి లేకపోవడం వలన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడం అనే అంశాన్ని భారత ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్ల లబ్ధి పొందడానికి ప్రయోగించదలచుకున్నదని పలువురు అంటున్నారు.

కాశ్మీర్లో 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత- ఆ పరిణామమే ఉగ్రవాదులను రెచ్చగొట్టినట్లుగా అయిందని అభిప్రాయపడేవారు అనేకమంది ఉన్నారు. పిఓకే ను కూడా భారత్ లో విలీనం చేసుకోవడం వలన మరిన్ని సమస్యలను, మరింత ఉగ్రవాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని అభిప్రాయపడుతున్న వారు కూడా ఉన్నారు. 

పీఓకే ప్రజలు పాకిస్తాన్ పట్ల అసంతృప్తితో ఉన్నారని సాకు చూపించి, వారిని విలీనం చేసుకునే ప్రయత్నం జరిగితే.. మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లుగా తయారవుతుందని భారత దేశపు సార్వభౌమత్వ రక్షణ ను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి రాజ్ నాధ్ సింగ్ ఈ మాటలు ఎందుకు అన్నారో.. తద్వారా ఏం సాధించదలచుకుంటున్నారో వేచిచూడాలి.