మల్లాది..పింగళి..ఆత్రేయ,…జంధ్యాల…త్రివిక్రమ్..వీరే కాదు..వీరు మాత్రమే కాదు. తెలుగు సినిమా మాటల బాంఢాగారాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో వున్నారు. అయితే వారిలో కొందరు మాత్రం ప్రత్యేకం. రాసే మాట కేవలం ఓ సినిమా కోసం లేదా ఓ సన్నివేశం కోసం అని వారు ఏనాడూ అనుకోలేదు. మాటలో తాము కనిపించాలని తాపత్రయ పడలేదు. ఆ మాట పదికాలాల పాటు నిలిచి వుండాలని మాత్రం అనుకునే వుంటారు కచ్చితంగా. అందుకే వారు కూడా మాటలతో పాటు సినిమా చరిత్రలో నిలిచిపోయారు.
మనసు కవి అని ఆచార్య ఆత్రేయకు బిరుదు ఇచ్చిన తరువాత తెలుగునాట మళ్లీ ఓ మాటల రచయితకు బిరుదు అంటూ సహజంగా రావడం ఎవరికి సాధ్యమైంది? అది మాత్రమే కాదు…తరతరాల తెలుగు సినిమా రచయితల్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన, అనితర సాధ్యమైన స్థానాన్ని సంపాదంచుకున్న వారి జాబితాలో చేరడం అన్నది ఈ జనరేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కే సాధ్యమైంది.
సాధారణంగా మాటల రచయితలుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారు నటులుగానో, దర్శకులుగానో మారడం వరకు ఓకె. కానీ అలా మారిన తరువాత మరీ అద్భుతాలు సాధించిన వారు మాత్రం అరుదు. జంధ్యాల రెండు గుర్రాల స్వారీ చేసారు. రెండింటా విజయాలు సాధించారు. కానీ అగ్ర హీరోలు సైతం ఆయన తో సినిమా చేసి తీరాలన్నంత బలమైన కోరిక కలిగేలా చేయలేకపోయారు. ఆత్రేయ కేవలం మాటలు, పాటల రచయితగానే విజయం సాధించగలిగారు.
కానీ తివిక్రమ్ అలా కాదు. ఆయన ఎయిమ్ మొదటి నుంచి దర్శకత్వం వైపే. కానీ అందుకు పునాదిని మాత్రం మాటల రచయితగా వేసుకున్నారు. మాటల రచయితగా పనిచేసిన కొన్ని సినిమాల విజయం వెనుక పునాది త్రివిక్రమ్ నే. ఎందుకంటే ఆ దర్శకులు త్రివిక్రమ్ లేకుండా మళ్లీ విజయం సాధించకలేకపోయారు.
సాధారణంగా సంభాషణలు బలంగా వుండాలనో, సన్నివేశానికి సంభాషణలతో మరింత బలం రావాలనో, చాలా బరువైన పదజాలం వాడడం అన్నది రచయితలకు అలవాటు. అంతే కానీ లలితమైన పదజాలం వాడడం అరుదు. పైగా ఆత్రేయ లాంటి వారి సంభాషణల్లో కొద్దిగా అయినా నాటకీయ భాష తొంగిచూసేది. ఆకాశమార్గాన పయనించే కవిత్వాన్ని శ్రీశ్రీ భూమార్గం పట్టించి పామరజన రంజకంగా మార్చినట్లే, త్రివిక్రమ్ సినిమా సంభాషణల తీరును మార్చేసారు.
మామూలుగా జన బాహుళ్యంలో వున్న పదనాలు, పోలికలు, వాడుకలు తీసుకుని, తన దైన శైలిలో వాటిని పేర్చి పదునైన, పసందైన సంభాషణలుగా మార్చేసారు. అవి జనాలకు ఇట్టే పట్టేసాయి. సాధారణంగా సుద్దులు చెబితే పెద్దగా ఇష్టపడని జనం సైతం, త్రివిక్రమ్ స్టయిల్ లో సుభాషితాలు చెప్పినా చక్కగా విన్నారు..వింటున్నారు. పైగా త్రివిక్రమ్ చాలా సార్లు జనం బాటనే పట్టారు తప్ప, ఆ ఆలోచన సరైనదా? కాదా? అన్నది డిస్కషన్ కు తీసుకురాలేదు.
తెల్లవారు ఝామున లేవడం మంచిదే…కానీ జనం సరదాగా అనేది వేరు..లేస్తే ఏం ఒరిగింది.. అలా లేచే కోడిని కూర వండుకు తినేస్తున్నారు. నిజానికి ఇలా భావనలను సీరియస్ రచయిత ఎంకరేజ్ చేయరు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. ' జనం కోరినది మనం శాయవలెనా? మనం చేసినది జనం చూడవలెనా' అన్న తర్కానికి దిగితే, జనం కోరినది తాను చేస్తాను అంటారు. అలా చేస్తూనే, మధ్యలో అప్పుడప్పుడు తాను అనుకున్నది చొప్పిస్తూ వెళ్తారు.
ఇదంతా మాటల రచయితగా త్రివిక్రమ్ గురించి…ఇది మాత్రమే కాదు చెప్పుకుంటూ పోతే ఎంతయినా వుంది. ఆయన సినిమాల నుంచి తెచ్చి కుమ్మరించగలిగిన మాటల ముత్యాల మూట చాలా పెద్దదే వుంది. బరువుగానే వుంటుంది.
కానీ త్రివిక్రమ్ దర్శకుడు కూడా. కేవలం దర్శకుడు మాత్రమే కాదు. టాలీవుడ్ టాప్ త్రీ దర్శకుల్లో ఒకరు. ఏ దర్శకుడితో పని చేయడం కోసం హీరోలు ఉవ్విళ్లూరతారో? ఏ దర్శకుడి తో పని చేసేందుకు కథానాయకులు కాస్త వెయిటింగ్ లో వుండడం కూడా ఇష్టంగా ఫీలవుతారో? ఏ దర్శకుడితో పని చేయడం తమ అచ్యూవ్ మెంట్ గా టాలీవుడ్ టెక్నీషియన్లు భావిస్తారో? ఏ దర్శకుడి సినిమాలో ఓ చిన్న పాత్రయినా వేయగలిగితే చాలు అని అందరూ అనుకుంటారో? అలాంటి దర్శకుడు టాప్ లీగ్ లో వున్నట్లేగా?
ఆ విధంగా త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ త్రీలో కచ్చితంగా వున్నారు. వుంటూ వస్తున్నారు. అయితే రచయితగా పున్నమి చంద్రుడిలా వంకలేని త్రివిక్రమ్ దర్శకుడిగా మాత్రం ఇంకా ఆ రూపాన్ని సంతరించుకోవాల్సి వుంది.
ఎందుకంటే రాజమౌళి లగాయతు టాలీవుడ్ లో అందరి మీద వున్న 'ఇన్ స్పయిర్' లేదా ' అనుసరణ.'…లేదా 'కాపీ' అనే మరక త్రివిక్రమ్ మీద కూడా వుంది. దాన్ని ఆయన తుడిచేసుకోగలిగితే, ఇక డైరక్టర్ గా కూడా పున్నమి చంద్రుడే.
ఇదంతా త్రివిక్రమ్ కు తెలియంది కాదు…ఎందుకంటే జనం ముందు వుండే త్రివిక్రమ్ వేరు. ఇంట్లో అద్దం ముందు వుండే త్రివిక్రమ్ వేరు. జనాల ముందు, పరిస్థితులకు అనుగుణంగా అద్భుతంగా నటించగల వారే జీవితంలో, కెరీర్ లో పైకి వస్తారు. త్రివిక్రమ్ కూడా ఈ నటనకు అతీతమేమీ కాదు.
ఈ చిన్న విషయాన్ని అలా వదిలేసి, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 'ఆకెళ్ల నాగ వెంకట శ్రీనివాస్' కు శుభాకాంక్షలు చెబుదాం.