గడిచిన కొన్ని నెలలతో పోల్చి చూస్తే.. మే నెలలో సినిమా రిలీజ్ లు కాస్త తగ్గాయి. డబ్బింగ్, స్ట్రయిట్, ఓటీటీలతో కలుపుకొని అటుఇటుగా 17 సినిమాలు మాత్రమే వచ్చాయి. అయితే విడుదలైనవి తక్కువ సినిమాలే అయినప్పటికీ, అందులో 2 పెద్ద హిట్స్ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. మే నెలలో సర్కారువారి పాట డామినేషన్ కనిపించగా.. ఎఫ్3 సినిమా మంచి ముగింపును ఇచ్చింది.
మే మొదటి వారంలో అశోకవనంలో అర్జునకల్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున్ కల్యాణం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా బాగుందంటూ మౌత్ టాక్ వ్యాపించేలోపే, సర్కారువారి పాట వచ్చి దెబ్బేసింది. అలా విశ్వక్ సినిమా పేరుకే హిట్టయింది తప్ప, కాసులు కురిపించలేకపోయింది.
దశాబ్దాల గ్యాప్ తర్వాత సుమ నటించిన జయమ్మ పంచాయితీ కూడా ఇదే వారం రిలీజైంది. తనకున్న పరిచయాలతో ఈ సినిమా ప్రచారానికి స్టార్స్ ను తీసుకొచ్చిన సుమక్క.. థియేటర్లకు ప్రేక్షకుల్ని మాత్రం రప్పించలేకపోయింది. సుమ భారీ ఆశలు పెట్టుకున్న 'జయమ్మ' బాక్సాఫీస్ బరిలో బోల్తాకొట్టింది. ఇక శ్రీవిష్ణు, భళాతందనానతో తన ఫ్లాపుల పరంపరను మరోసారి కొనసాగించాడు. మంచి కథలు సెలక్ట్ చేసుకుంటాడనే ఇమేజ్ ఉన్న ఈ హీరోపై, ప్రేక్షకులు అనుమానాలు పెంచుకునేలా చేసింది ఈ మూవీ.
మే రెండో వారంలో మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా వచ్చింది. దాదాపు 80శాతం థియేటర్లలో ఇదే రిలీజైంది. అప్పటివరకు ఉన్న సినిమాలన్నీ 'సర్కారు' దెబ్బకు లేచిపోయాయి. మహేష్ మేకోవర్, సినిమాలో వినోదం అందర్నీ ఆకట్టుకున్నప్పటికీ, దర్శకుడు పరశురామ్ రైటింగ్ లో లోపాలు పంటికింద రాళ్లలా తగిలాయి. మొత్తమ్మీద మిక్స్ డ్ టాక్ తో మొదలై హిట్ టాక్ తో స్థిరపడింది ఈ సినిమా.
ఈ సినిమా వచ్చిన 24 గంటల గ్యాప్ లో వచ్చింది డాన్ అనే సినిమా. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ డబ్బింగ్ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ జనాలు మాత్రం థియేటర్లలకు వెళ్లలేదు. అప్పటికే భారీస్థాయిలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో, డాన్ కు చాలా తక్కువ సంఖ్యలో స్క్రీన్స్ దొరికాయి. ఈ రాంగ్ టైమింగే సినిమాకు ప్రధాన అడ్డంకిగా మారింది. లేదంటే ఈ మూవీ మరో 'వరుణ్ డాక్టర్' అయ్యేది.
ఇక మే నెల మూడో వారం బాక్సాఫీస్ కు డ్రై వీక్ అని చెప్పాలి. శేఖర్, డేగల బాబ్జీ, ధగడ్ సాంబ లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. రాజశేఖర్ హీరోగా నటించిన మలయాళీ రీమేక్ సినిమా శేఖర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. పైగా కోర్టు కేసు కారణంగా థియేటర్లలో ఈ సినిమాను ఒక రోజంతా ప్రసారం చేయలేదు. ఈ ప్రభావంతో పాటు.. స్లోగా సాగే నెరేషన్, దర్శకత్వంలో లోపాలు ఈ సినిమాను దెబ్బతీశాయి. ఇక బండ్ల గణేశ్ నటించిన సోలో పెర్ఫార్మెన్స్ మూవీ డేగల బాబ్జీ, సంపూర్ణేష్ చేసిన ధగడ్ సాంబ, ధ్వని అనే మరో చిన్న సినిమా వచ్చిన రోజే వెనక్కి వెళ్లాయి.
చివరి వారంలో అందరూ ఎంతగానో ఎదురుచూసిన ఎఫ్3 సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఎఫ్2 సక్సెస్ తో భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు కొందరు, ఎఫ్3లో కామెడీ చూసి పెదవి విరిచారు. సర్కారువారి పాట సినిమా టైపులోనే దీనికి కూడా మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా నిలదొక్కుకుంది. ఈ సినిమా పూర్తి ఫలితం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
ఎఫ్3 వచ్చిన మరుసటి రోజు బ్లాక్ అనే సినిమా వచ్చింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హీరో ఫ్లాప్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఇక ఈ నెల ఓటీటీ విషయానికొస్తే కీర్తిసురేష్ నటించిన చిన్ని సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం కీర్తి పెర్ఫార్మెన్స్ కు మాత్రమే మార్కులుపడ్డాయి. దొంగాట. రైటర్ సినిమాలు కూడా ఏమంత ప్రభావం చూపలేకపోయాయి. ఓవరాల్ గా మే నెల బాక్సాఫీస్ లో మహేష్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది.