వర్త‌మాన వినోదంపై అర్థ‌వంత‌మైన‌ సెటైర్ ‘ ది ట్రూమ‌న్ షో’

అమెరికాలో 1997లో బిగ్ బ్ర‌ద‌ర్ టీవీ షో తొలి సారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ టీవీ షో కు మూలం జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 అనే న‌వ‌ల‌. ఆ న‌వ‌ల్లోని బిగ్ బ్ర‌ద‌ర్…

అమెరికాలో 1997లో బిగ్ బ్ర‌ద‌ర్ టీవీ షో తొలి సారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ టీవీ షో కు మూలం జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 అనే న‌వ‌ల‌. ఆ న‌వ‌ల్లోని బిగ్ బ్ర‌ద‌ర్ అనే ఫిక్ష‌నల్ క్యారెక్ట‌ర్, కాన్సెప్ట్ ఆధారంగా బిగ్ బ్ర‌ద‌ర్ పేరుతోనే టీవీ షోను ప్రారంభించారు. కొంత‌మంది ప్ర‌జ‌లెరిగిన వాళ్ల‌ను ఒక ఇంట్లో పెట్టి.. సీసీ కెమెరాల‌తో వారి దిన‌చ‌ర్య‌ల‌ను వీడియోలుగా చిత్రీక‌రించి, టీవీ ద్వారా ప్రసారం చేయ‌డం అనే కాన్సెప్ట్ తో రూపొందించిన ఆ రియాలిటీ షో ఆదిలోనే సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ఈ త‌ర‌హా వినోదం లోని చీక‌టి కోణాన్ని ఆ వెంట‌నే ప్ర‌జ‌ల‌కు చూపిస్తూ ఒక సినిమా వ‌చ్చింది అదే 'ది ట్రూమ‌న్ షో'.

హాలీవుడ్ నుంచి వ‌చ్చిన క్లాసిక్స్ లో ఇదీ ఒక‌టి. 1997లో బిగ్ బ్ర‌ద‌ర్ టీవీ షో తొలి సీజ‌న్లో ప్ర‌సారం కాగా, 1998లో ది ట్రూమ‌న్ షో విడుద‌ల అయ్యింది. స‌రిగ్గా.. బిగ్ బ్ర‌ద‌ర్ షో మీద సెటైర్ కాదు కానీ, భ‌విష్య‌త్ కాలంలో మారిపోయే ప్ర‌జ‌ల ప్రేక్ష‌కాభిరుచుల‌ను ముందుగానే ఎక్స్ పెక్ట్ చేసి తీశారేమో అనేంత స్థాయిలో ఉంటుంది 'ది ట్రూమ‌న్ షో'. ఇండియా వంటి దేశంలో కూడా బిగ్ బాస్ పేరుతో బిగ్ బ్ర‌ద‌ర్ రియాలిటీ షో సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రాంతీయ భాష‌ల్లోకి వ‌చ్చింది. బిగ్ బాస్ షో తో కొంద‌రు ఫేమ‌స్ అవుతున్నారు, కొన్ని విమ‌ర్శ‌లూ త‌ప్ప‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో బిగ్ బాస్ ను వీక్షిస్తూ దాన్ని వినోదంగా భావించే వాళ్లు త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా ది ట్రూమ‌న్ షో!

బిగ్ బాస్ టీవీ షోకు సూప‌ర్లేటివ్ లాంటిదే ది ట్రూమ‌న్ షో సినిమా. బిగ్ బాస్  షో కోసం దాని క్రియేట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు సెల‌బ్రిటీల‌ను ఎంపిక చేస్తారు.  కొన్ని రోజుల పాటు  వారిని అక్క‌డ ఉంచ‌డం, వారి మ‌ధ్య గొడ‌వ‌లు.. ర‌చ్చ‌లు.. ఇదే  వినోదం. అయితే ఈ సెల‌బ్రిటీల్లో ఎంత‌మంది అక్క‌డ పూర్తి స్వ‌త‌హాగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ప్రేక్ష‌కుల‌కు తెలిసే అంశం కాదు. వీళ్ల‌లో ఎలాగూ చాలా మంది న‌టులే కాబ‌ట్టి.. అక్క‌డ కూడా న‌టించ‌నూ వ‌చ్చు. ఇలాంటి న‌ట‌న‌కు క‌ల‌లో కూడా అవ‌కాశం లేకుండా.. ఒక వ్య‌క్తి జీవితాన్ని బిగ్ బాస్ ప్రోగ్రామ్ గా మారిస్తే? అత‌డు త‌న జీవితంలోని ప్ర‌తి రోజూ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అత‌డి బుద్దేమిటి, క‌ల‌లేమిటి.. అనే విష‌యాల‌ను టీవీ ప్రోగ్రామ్ గా మారిస్తే.. అనే ఆలోచ‌న‌తో ఒక టీవీ చాన‌ల్ క్రియేటివ్ హెడ్ సృష్టించిందే 'ది ట్రూమ‌న్ షో'. త‌న‌కు తెలియ‌కుండా త‌న జీవితం ఒక టీవీ ప్రోగ్రామ్ గా మారిపోయిన బాధితుడు ట్రూమ‌న్. అత‌డి చుట్టూ ఒక క‌ల్పిత ప్ర‌పంచం. అది క‌ల్పిత ప్ర‌పంచం అనేది త‌న‌కు తెలియ‌దు. త‌న జీవితం ఆధారంగా 24 ఇంటూ సెవెన్ ఒక టీవీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోంద‌నే విష‌య‌మూ తెలియ‌దు! ఈ ప‌రిణామాల మ‌ధ్య‌న‌.. ఏదో జ‌రుగుతోంద‌న్న అనుమానాల‌తో .. అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్న ట్రూమ‌న్ ప్ర‌య‌త్నాల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకునే సినిమా ఇది.

ట్రూమన్.. ఒక ఇన్సూరెన్స్ పాల‌సీ ఏజెంట్. ఉద‌యం లేస్తే భార్య‌, త‌ల్లి, ఆఫీసు, ప‌ల‌క‌రించే ఇరుగూపొరుగు ఇదే అత‌డి ప్ర‌పంచం. త‌న జీవితంలో ఏనాడూ న‌గ‌రం దాటి ఎర‌గ‌డు. ఇలా ఎంతో మంది బ‌తుకుతూ ఉంటారు. వారిలో ట్రూమ‌న్ కూడా ఒక‌డు. ట్రూమ‌న్ కూడా అంద‌రిలాంటి మ‌నిషే. అత‌డికీ బ‌లాలుంటాయి, బ‌ల‌హీన‌త‌లుంటాయి. పెళ్లికి ముందు ఒకసారి ఒక‌మ్మాయితో డేట్ కు వెళ్లి ఉంటాడు. తొలి కిస్ ఆమెతోనే. ఆ త‌ర్వాత‌ ఆ అమ్మాయిని ఆమె తండ్రి తీసుకెళ్లిపోతాడు. ఫిజీ వెళ్లిపోతున్న‌ట్టుగా ఆమె చెప్పి ఉంటుంది. ఆ త‌ర్వాత ట్రూమ‌న్ కు మ‌రో అమ్మాయితో పెళ్లి. త‌ల్లి, పెళ్లాంతో క‌లిపి జీవ‌నం సాగిస్తూ ఉంటాడు. అయితే తొలి ప్రియురాలిని చూడటానికి ఒక్కసారైనా ఫిజీ వెళ్లాల‌నే కోరిక ఉంటుంది. అందు కోసం డ‌బ్బులు జ‌మ చేసుకోవాల‌నుకుంటాడు. అయితే ఫిజీ కాదు క‌దా..ప‌క్కూరికి కూడా వెళ్ల‌నివ్వ‌వు అత‌డి చుట్టూ ఉన్న ప‌రిస్థితులు. ర‌క‌ర‌కాల అవాంత‌రాలు ఎదుర‌వుతూ ఉంటాయి.

చిన్న‌ప్పుడు..ఒక తుఫాన్ వేళ తండ్రితో క‌లిసి చిన్న బోట్ లో ప్ర‌యాణం చేస్తుంటే, ఆ బోట్ మునిగిపోయి ట్రూమ‌న్ తండ్రి చ‌నిపోయి ఉంటాడు. ఆ అనుభ‌వంతో నీళ్లంటే భ‌యం. ఉన్న‌ట్టుండి ఒక సారి రోడ్డు మీద ఒక వృద్ధుడు క‌నిపిస్తాడు. స‌రిగా చూస్తే త‌నెవ‌రో కాదు.. త‌న తండ్రి! మాట్లాడించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే త‌న తండ్రిని ఎవ‌రో తీసుకెళ్లిపోతారు. గాబ‌రాప‌డ్డ ట్రూమ‌న్ ఆ విష‌యాన్ని ఇంటికి వ‌చ్చి చెబుతాడు. అయితే త‌ల్లే ఆ విష‌యాన్ని న‌మ్మ‌దు! అక్క‌డ నుంచి త‌న చుట్టూ ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానాలు ట్రూమ‌న్ కు వ‌స్తాయి. ఈ అనుమానాల‌ను త‌న ప్రాణ స్నేహితుడి ద‌గ్గ‌ర వ్య‌క్తం చేస్తాడు. అలాంటిదేమీ లేద‌ని అత‌డు న‌మ్మ‌కంగా చెబుతాడు. భార్య‌తో త‌న ప‌రిస్థితిని వివ‌రిస్తాడు. ఆమె కూడా ట్రూమ‌న్ మాట‌ల‌కు విలునివ్వ‌దు. అయితే.. అంద‌రి ప్ర‌వ‌ర్త‌నా తేడా ఉంద‌నే విష‌యం ట్రూమ‌న్ కు స్ప‌ష్టం అవుతుంది. వారి మ‌ధ్య నుంచి త‌ను పారిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఒక‌వైపు ట్రూమ‌న్ ఈ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా.. అత‌డి చుట్టూ ఏం జ‌రుగుతోందో ప్రేక్ష‌కుల‌కు క్లారిటీ ఇస్తారు.

ట్రూమ‌న్.. అమెరికాలో ఒక జంట‌ వ‌ద్ద‌నుకున్న ఒక అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ. అబార్ష‌న్ కు రెడీ అయిన కొన్ని జంట‌ల‌ను పిలిచి, వారిలో ఒక మ‌హిళ గ‌ర్భంలోని పిల్లాడితో రియాలిటీ షో మొద‌లుపెడ‌తాడు ఒక చాన‌ల్ క్రియేటివ్ హెడ్. ఆ షో పేరే 'ది ట్రూమ‌న్ షో'. త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్ప‌టి నుంచినే ట్రూమ‌న్ ఏం చేస్తున్నాడు.. అనే విష‌యం ద‌గ్గ‌ర నుంచి ఆ షో మొద‌ల‌వుతుంది. ట్రూమ‌న్ పుట్ట‌డంతోనే అత‌డి చుట్టూ ఒక క‌ల్పిత ప్ర‌పంచాన్ని సృష్టిస్తాడు. ట్రూమ‌న్ త‌ల్లి కూడా ఆ రియాలిటీ షోలో ఒక పాత్ర‌ధారి అవుతుంది. ఆఖ‌రికి తండ్రి కూడా! వాస్త‌వానికి ట్రూమ‌న్ తండ్రి చ‌నిపోవ‌డ‌మే అబ‌ద్ధం.

తండ్రి అలాంటి ప‌రిస్థితుల్లో చ‌నిపోతే..ట్రూమ‌న్ ఎలా స్పందిస్తాడ‌నే డ్రామా కోసం అలాంటి సీన్ క్రియేట్ చేసి ఉంటారు.  ఇలా అడుగ‌డుగునా ట్రూమ‌న్ భావోద్వేగాల‌తో క్రియేట‌ర్ ఆడుకోవ‌డం, అత‌డి చుట్టూ ఉన్న కెమెరాల ద్వారా ఆ సీన్ల‌ను చిత్రీక‌రించి.. ఇర‌వై నాలుగు గంటలూ ది ట్రూమ‌న్ షో లైవ్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దీని కోసం ఒక శాటిలైట్ స్టేష‌న్, ట్రూమ‌న్ చుట్టూ ఒక న‌గ‌రం, అత‌డి చుట్టూ వంద‌ల మంది పాత్ర‌ధారులు సృష్టించ‌బ‌డి ఉంటారు. ట్రూమ‌న్ షో విప‌రీత‌మైన వీక్ష‌కాద‌ర‌ణ పొందుతుంది. క‌ల్పిత ప్ర‌పంచంలో ప్ర‌వేశ‌డ్డ ఒక నిజ‌మైన మ‌నిషి భావోద్వేగాలు, అత‌డి ఆశ‌లు, ఆలోచ‌న‌లు, అత‌డ తీరు గురించి చూడ‌టాన్ని గొప్ప వినోదంగా భావిస్తుంటారంతా. వీళ్ల‌ను చూస్తే.. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా గుర్తుకు వ‌స్తారు.

త‌న జీవితం ఒక రియాలిటీ షోగా సాగుతోంద‌న్న విష‌యం ట్రూమ‌న్ కు అర్థం అవుతుంది. ఆఖ‌రికి త‌న ఫ‌స్ట్ డేట్ ప్రియురాలు కూడా ఈ షోలో ఒక పాత్ర అని, ఆమె కూడా స్క్రిప్ట్ మేర‌కు వ‌చ్చి వెళ్లింద‌ని తెలుస్తుంది. త‌న భార్య‌, త‌ల్లి, స్నేహితుడు.. త‌న కొలీగ్స్, ఇరుగుపొరుగు.. ఏ ఒక్క‌రూ నిజమైన వ్య‌క్తులు కాద‌ని, కేవ‌లం పాత్ర‌లు అని స్ప‌ష్టం అవుతుంది. ఈ న‌కిలీ ప్ర‌పంచం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ట్రూమ‌న్ క‌దులుతాడు. అయితే అత‌డి చుట్టూ ఏర్ప‌రిచిన కెమెరాలు ఎక్క‌డ ఉన్నా త‌న‌ను ప‌ట్టిస్తాయి. త‌న కోసం, ఆ షో కోసం ఏర్పాటు చేసిన ఆ క‌ల్పిత న‌గ‌రం నుంచి బ‌య‌ట‌ప‌డటానికి స‌ముద్ర‌మార్గాన్నే ఎంచుకుంటాడు. అయితే ట్రూమ‌న్ ను ఆప‌డానికి ఆ ప్రోగ్రామ్ క్రియేట‌ర్.. తుఫాన్ ను సృష్టిస్తాడు. గాలి వేగాన్ని పెంచిస్తాడు. ఆఖ‌రికి ట్రూమ‌న్ చ‌నిపోయే ద‌శ‌లో.. మ‌ళ్లీ మాట్లాడిస్తారు.  బ‌య‌ట‌కు వెళ్తే ఇంత‌క‌న్నా గొప్ప జీవితం ఉండ‌దంటాడు. ఈ ప్రోగ్రామ్ అంత లైవ్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. పాతికేళ్ల‌కు పైగా ఆ ప్రోగ్రామ్ ను వీక్షించిన వాళ్లు కూడా ట్రూమన్ బ‌య‌ట‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తారు.

అంత వ‌ర‌కూ అత‌డి వ్య‌క్తిగ‌త జీవితాన్ని వినోదంగా వీక్షించిన వారు.. ట్రూమ‌న్ బ‌య‌ట‌కు రావాల‌ని కోరుకుంటారు.  క్రియేట‌ర్ ఎన్ని ర‌కాలుగా సైక‌లాజిక‌ల్ గేమ్ ను ప్ర‌ద‌ర్శించి ట్రూమ‌న్ ను షోలోనే ఉంచాల‌ని ప్ర‌య‌త్నించినా, ఆ ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డం.. త‌న ట్రేడ్ మార్క్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్, గుడ్ నైట్ చెప్పి.. ట్రూమ‌న్ తెర‌ను తొల‌గించి బ‌య‌ట‌కు రావ‌డంతో సినిమా ముగుస్తుంది. అంత వ‌ర‌కూ ఈ షో కే అంకిత‌మైన‌ ప్రేక్ష‌కులు రిమోట్ కు ప‌ని చెప్పి.. మ‌రో చాన‌ల్ కు మారడంతో.. వారి జీవితంలోనూ ట్రూమ‌న్ ను మ‌రిచిపోవ‌డం మొద‌ల‌వుతుంది.

బ‌హుశా.. మార‌బోయే ప్రేక్ష‌కుల అభిరుచుల‌ను, టీవీ చాన‌ల్స్ లో రాబోయే రియాలిటీ షో పోక‌డ‌ల‌ను వంద‌శాతం ఒడిసిప‌ట్టిన మ‌రో సినిమా ఏదీ ఉండ‌దు, ఒక్క ది ట్రూమ‌న్ షో త‌ప్ప‌! ఈ సినిమాలో చూపించిందే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. చ‌ట్టాలు, సాంకేతిక‌త లేదు కాబ‌ట్టి.. సెల‌బ్రిటీల‌ను మాట్లాడుకుని వారి భావోద్వేగాల పేరుతో రియాలిటీ షోలు న‌డుస్తున్నాయి.

ఈ రియాలిటీకి కాస్త ఫిక్ష‌న్ ను జోడిస్తే.. ఈ సినిమాలో చూపించిందే వాస్త‌వంలో జ‌రుగుతుంది. అయినా.. అప్పుడే ఏమైంది.. ఏమో ముందు ముందు.. ది ట్రూమ‌న్ షో లాంటి షో లు ప్ర‌సార‌మూ కావొచ్చేమో!  రియాలిటీ షో ల పేరుతో జ‌రిగే డ్రామాల్లోని డొల్ల‌త‌నాన్ని వీటి పుట్టుక ముందే సినిమాగా 'ది ట్రూమ‌న్ షో' బ‌య‌ట‌పెట్టింది. వినోదం పేరుతో సాగే అమాన‌వీయ‌త‌లోని గాఢ‌త‌ను చాటి చెప్పింది.

-జీవ‌న్ రెడ్డి.బి