పదేళ్ల కల. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ అవతరించిన సందర్భం. మెగా కాంపౌండ్ లో చిరంజీవి తర్వాత ఆ ఘనత సాధించిన వ్యక్తి. అందుకే కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికొచ్చిన పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు మెగా కుటుంబ సభ్యులు.
చిరంజీవి ఇల్లు అల్లంత దూరం ఉందనగా టపాసులు, డబ్బుల మోత మొదలైంది. అలా ఆర్భాటంగా చిరంజీవి ఇంట్లో అడుగుపెట్టారు పవన్. కారు దిగినప్పట్నుంచి ఇంటి లోపలకు వెళ్లేంతవరకు ఆయనపై పూల వర్షం కురుస్తూనే ఉంది.
కారు దిగిన వెంటనే రామ్ చరణ్ ఎదురెళ్లి బాబాయ్ కు స్వాగతం పలికాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఆలింగనం చేసుకున్నాడు. పవన్ తల్లి, కొడుక్కి దిష్టి తీయగా, చిరంజీవి భార్య సురేఖ, మరిదికి హారతిచ్చారు. అలా కొడుకు అకిరా, భార్య అన్నా లెజనెవాతో కలిసి చిరు ఇంట్లోకి అడుగుపెట్టిన పవన్ కు ఎదురుగా చిరంజీవి కనిపించారు.
అన్నయ్యను చూసిన వెంటనే పవన్, ఆయన కాళ్లకు నమస్కరించారు. తమ్ముడ్ని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి, ముద్దిచ్చి ఆలింగనం చేసుకున్నారు. పెద్ద పూలమాల వేసి సత్కరించారు. తల్లి వదినతో కలిసి కేక్ కట్ చేశారు పవన్. సాయిధరమ్ తేజ్ ఈల వేసి గోల చేయగా, మిగతా సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
ఇలా ఒక రేంజ్ లో అంతా పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ మాత్రం కనిపించలేదు.