పవన్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రత్యర్ధులూ వాడుతూంటారు. పవన్ కి తిక్క ఉంది అని. అయితే పవన్ తిక్కకు ఒక లెక్క ఉందని తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పోయిన చోటనే వెతుక్కోవాలన్నది పవన్ ని చూసే నేర్చుకోవాలి. అలాగే ఓటమికి కృంగి పోరాదని విజయం కోసం ఎందాకైనా పోరాడాలని కూడా పవన్ దగ్గరే నేర్చుకోవాలి.
రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి రాజకీయాలు ఎందుకు అని కూడా అన్నారు.ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు అయినా ఎమ్మెల్యే కాలేదని ప్రత్యర్ధులు ఎన్నో విమర్శలు చేశారు. పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని అన్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా దారుణంగా మాట్లాడారు. పవన్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని కూడా అన్నారు. ఎగతాళీయే చేశారు.
పవన్ కి మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే సత్తా లేనే లేదని అన్నారు. అసలు ఆయన రాజకీయాలకే పనికిరారు అన్నారు. అయితే పవన్ అవన్నీ ఓపికగా భరించారు. ఆయన ఎక్కడా తగ్గలేదు. సహనంగానే ఉన్నారు. గెలుపు పిలుపు కోసం తనదైన తీరులో కష్టపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఏమి తెలుసు రాజకీయాలు అన్న వారూ ఉన్నారు. సొంత సామాజిక వర్గంలోని దిగ్గజ నేతలు కూడా పవన్ రాజకీయ దారిని తప్పు పట్టారు.
అయితే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని త్యాగాలు చేశారు. ఆయన పార్టీ యాభై సీట్లు తీసుకుంటుంది అన్న వారి అంచనాలను పక్కన పెట్టి మొదట 24 తీసుకున్నా ఆ తరువాత కాస్తా 21కి అడ్జస్ట్ అయ్యారు. మూడు ఎంపీలు రెండుగా మారినా ఆయన సరేననుకున్నారు. ఇదంతా ఏపీలో టీడీపీ కూటమి విజయానికి బాటలు వేయడానికే అనంది ఫలితాల తరువాత అందరికీ అర్ధం అయింది.
పవన్ తనకు ఇచ్చిన 21 సీట్లలో గెలిచారు. అంతే కాదు రెండు ఎంపీ సీట్లు గెలిచారు. తన పార్టీ ఓట్లు అన్నీ కూడా టీడీపీ కూటమికి జాగ్రత్తగా బదిలీ అయ్యేలా చూసారు. ఈ కారణం వల్లనే కూటమి అభ్యర్ధుల మెజారిటీలు తొంబై వేల దాకా వెళ్ళాయి. అలా కూటమికి కేంద్ర బిందువుగా పవన్ ఉన్నారు. చంద్రబాబు అనుభవం కూటమికి ఎంతో దోహదపడితే పవన్ త్యాగం దానిని మరింత పటిష్టం చేసింది.
నిజానికి 2019 తరువాత పవన్ వేసిన ప్రతీ అడుగులో వ్యూహం ఉంది. పవన్ కి తిక్క ఉంది కానీ లెక్క లేదు అన్న వారికి అసలైన జవాబు ఆయన పార్టీ సాధించిన ఘన విజయం. పవన్ 2019 ఎన్నికల్లో ఓడాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలా ఆయన సరైన పంధాలోనే ముందుకు నడిచారు. ఇక ఆ మీదట తన పార్టీని నిత్యం జనాల్లో ఉంచుతూనే ఆయన 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినపుడు ఏకంగా రాజమండ్రి జైలుకు వచ్చి ఆయన్ని పరామర్శించారు. అక్కడే టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. ఆ తరువాత బీజేపీని కూటమిలోకి ఆహ్వానించడం కోసం ఆయన తెర వెనక చేసిన కృషి అమోఘం అనే చెప్పాలి.
అలా టీడీపీ కూటమి 164 సీట్లను సాధించడంలో పవన్ పడిన కష్టం ఆయన వ్యూహాలు గొప్పగానే ఉన్నాయ్ని చెప్పాలి. సీఎం పదవి రెండున్నరేళ్ల పాటు తీసుకోమని అంతా చెప్పినా పవన్ అది కాదు మన రాజకీయ దారి రహదారి అది ఇదే అంటూ ఆయన చెప్పిన విధానం ఆ విధంగా ఆయన డిజైన్ చేసుకున్న విధానం చూసిన వారు ఎవరైనా అనే మాట ఒక్కటే పవన్ కి తిక్క కాదు పక్కాగా పొలిటికల్ లెక్క ఉందని.