రేపటి రోజు కోసం మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగా హీరోల నుంచి రేపు ఏ సినిమా రిలీజ్ లేదు. కనీసం ఎవ్వరి పుట్టినరోజు కూడా లేదు. అయినా కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం భోళాశంకర్.
చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లోకి వస్తున్న ఈ సినిమా కనీసం ఓటీటీలో క్లిక్ అయినా పండగ చేసుకుందామని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది భోళాశంకర్. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే కావొచ్చు. 'భోళా' దెబ్బతో చిరు ఫ్యాన్స్ బాగా డీలా పడ్డారు.
థియేటర్లలో వారానికి మించి ఆడని ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. కనీసం ఓటీటీలోనైనా ఈ సినిమా హిట్టయితే, సంబర పడాలని చూస్తోంది అభిమానగణం.
అభిమానుల ఆశ నెరవేరుతుందా..?
ఫ్యాన్స్ కు ఆ ఆశ తీరకపోవచ్చు. ఎందుకుంటే, థియేటర్లలో క్లిక్ అయిన సినిమాకే ఓటీటీలో ఆదరణ. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఓటీటీలో ఆదరణ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ను భోళాశంకర్ తిరగరాస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఓటీటీ ఎనలిస్టులు మాత్రం కష్టం అంటున్నారు.
ఇక్కడ కూడా జైలర్ తో పోటీ.. థియేటర్లలో ఎలాగైతే భోళాశంకర్ కు కాస్త ముందుగా జైలర్ సినిమా రిలీజైందో, ఓటీటీలో కూడా అదే విధంగా చిరంజీవి సినిమా కంటే కాస్త ముందుగా జైలర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో ఇది ఎంత పెద్ద హిట్టయిందో, అదే స్థాయిలో ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 24 దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచిందంటే, సూపర్ స్టార్ హవా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఓటీటీలోకి భోళాశంకర్ కూడా వస్తోంది కాబట్టి.. మరోసారి రజనీకాంత్ సినిమాతో చిరంజీవి సినిమాను సరిపోల్చడం సహజంగా జరిగిపోతుంది. మరి ఓటీటీలో భోళా మేనియా కనిపిస్తుందా? మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.