మెలానియా డ్రెస్‌పై ఛ‌లోక్తులు

తామెక్క‌డ ఉంటే అక్క‌డి వాళ్ల‌లా ఉండాల‌నేది ఓ సూక్తి. అక్ష‌రాలా ఆ ప‌ద్ధ‌తుల‌ను, సంప్ర‌దాయాల‌ను పాటించిన వాళ్లే ఆ గ‌డ్డ గౌర‌వాన్ని, అభిమానాన్ని చూర‌గొంటారు. అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్ భార‌త‌దేశ సంప్ర‌దాయాల‌ను,…

తామెక్క‌డ ఉంటే అక్క‌డి వాళ్ల‌లా ఉండాల‌నేది ఓ సూక్తి. అక్ష‌రాలా ఆ ప‌ద్ధ‌తుల‌ను, సంప్ర‌దాయాల‌ను పాటించిన వాళ్లే ఆ గ‌డ్డ గౌర‌వాన్ని, అభిమానాన్ని చూర‌గొంటారు. అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్ భార‌త‌దేశ సంప్ర‌దాయాల‌ను, సంస్కృతిని గౌర‌విస్తూ…వ‌స్త్ర‌ధార‌ణ‌తో మ‌న‌దేశంలో అడుగు పెట్టారు.

అమెరికా నుంచి నేరుగా అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో మ‌న‌గ‌డ్డ‌పై అడుగు పెట్టారు. రాజ‌పం ఉట్టిప‌డేలా అడుగులో అడుగేస్తూ రాజహంసలా ఉన్న ఆమె భార‌తీయుల‌ను ఆక‌ట్టుకొంది.  తెల్లని జంప్‌ సూట్‌ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్  అందంగా చుట్టుకున్నారు. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా అయినా ఆమె భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించారు. ఆమె డ్రెస్ సెన్స్‌కు భార‌త్ ఫిదా అయ్యింది.
 
 ప్రముఖ ఫ్రెంచ్‌ అమెరికన్‌ డిజైనర్‌ హెర్వ్‌ పెయిరె డిజైన్‌ చేసిన సూట్‌ని ఆమె భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ధ‌రించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్‌ సూట్‌ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భార‌త్ క‌ట్టుబాట్ల‌ను ఆమె గౌర‌వించార‌నేందుకు నిద‌ర్శ‌నం లేక‌పోలేదు.

భారత్‌ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్‌లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్‌ పెయిర్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో  వెల్లడించారు. అందువ‌ల్లే మెలానియాకు ఆకుపచ్చ రంగు సాష్‌ను తయారు చేసినట్టు తెలిపారు.

మెలానియా డ్రెస్‌పై కొంద‌రు నెటిజ‌న్లు  హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అబ్బో డ్రెస్ అదుర్స్ అని కొంద‌ర‌న్నారు. మ‌రికొంద‌రు అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్‌ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు.