కెలికి తమాషా చూడడం ట్రంప్ కు వెన్నతో పెట్టిన విద్య. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పట్నుంచి మినిమం గ్యాప్స్ లో తన కెలుకుడు ఎలా ఉంటుందో రుచి చూపిస్తూనే ఉన్నాడు ట్రంప్. భారత్ పర్యటనలో కూడా అమెరికా అధ్యక్షుడు ఇలాంటి పనేదో చేస్తారని అంతా భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే జరిగింది. కశ్మీర్ అంశంపై ట్రంప్ స్పందించారు. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ కెలికారు.
కశ్మీర్ విషయంలో ముందు నుంచి మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తోంది భారత్. మూడో దేశం ప్రమేయం లేకుండా చర్చలు జరపాలని భావిస్తుంది. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు కుండబద్దలుకొట్టింది. గడిచిన కొన్నేళ్లుగా పాకిస్థాన్ చేస్తున్న పనుల వల్ల ద్వైపాక్షిక చర్చలకు కూడా నో చెప్పేసింది. ఇలాంటి టైమ్ లో మధ్యవర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ప్రకటించి భారత్ ను అసహనానికి గురిచేశారు. అయితే అదే సమయంలో భారత్ కు కాస్త మద్దతుగా కూడా ఆయన మాట్లాడ్డం విశేషం.
“భారత్-పాక్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే కారణం. ఈ వివాదం చాలా సంక్లిష్టమైనది. మోడీ ధృఢమైన వ్యక్తి. కశ్మీర్ అంశాన్ని ఆయన చూసుకోగలరు. అయితే ఇరుదేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం.”
ఇలా ఓవైపు మోడీ సమర్థుడంటూనే, మరోవైపు మధ్యవర్తిత్వం చేస్తామంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు ట్రంప్. అమెరికానే కాదు, ఏ దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ సహించదు. అటు పాకిస్థాన్ మాత్రం మధ్యవర్తిత్వం తమకు ఓకే అంటూ కూనిరాగాలు తీసింది ఆమధ్య. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు భారత్ కు కాస్త చిరాకు కలిగించేవే.
అయితే ఈ విషయాన్ని ట్రంప్ ఇలా టచ్ చేసి అలా వదిలేయడం, ఎక్కువగా భారత్ కు మద్దతుగా మాట్లాడ్డం కాస్త ఊరటనిచ్చే అంశాలు. మరీ ముఖ్యంగా ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, దాని గురించి మాట్లాడ్డానికేం లేదంటూ ట్రంప్ అనడం భారత్ కు కలిసొచ్చే అంశం. అయితే మధ్యవర్తిత్వం అంశాన్ని మాత్రం ప్రతిపక్షాలు గట్టిగా లేవనెత్తే అవకాశం ఉంది. దీన్ని మోడీ సర్కార్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.