తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ ఆస్తులపై మంగళవారం సాయంత్రం నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్ కంట తిరుపతి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తెల్లారేసరికి ఆక్రమిస్తాడనే పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే సంజయ్ పెద్ద ఎత్తున బినామీల పేర్లపై ఆస్తులను కూడబెట్టాడని తిరుపతి కోడై కూస్తోంది.
అల్లుడి అరాచకాలపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా సుగుణమ్మ ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు. అంతేకాదు సుగుణమ్మ అల్లుడిపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భారీగా సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి సుగుణమ్మకే తిరుపతి టికెట్ ఇవ్వడంతో….టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరపసన వ్యక్తం చేశాయి.
తిరుపతి నగరంలోని శ్రీనివాస పురం లోని “అలివేలు మంగ శ్రీ నివాసం” అనే అపార్ట్మెంట్ భవన నిర్మాణం సంజయ్ బినామీ అయిన బాలాజీ అనే వ్యక్తి పేరు పైన జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ బాలాజీ తిరుపతి రుయా హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ అపార్ట్‌మెంట్ భవన నిర్మాణం చేపట్టిన స్థలం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు పైన్నే ఉంది. రూ.30 కోట్లకు పైగా పెట్టుబడులు బాలాజీ పేరు పైన పెట్టి నిర్మాణ పనులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఒక సాధారణ ల్యాబ్ టెక్నీషియన్ అయిన బాలాజీ అంత భారీ పెట్టుబడి ఎలా పెట్టాడని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ దిశగానే శ్రీనివాసపురంలోని అపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఐటీ సోదాలు తిరుపతిలో కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా సాగించిన దోపిడీకి ఇప్పటికైనా తగిన మూల్యం చెల్లించే సమయం వచ్చిందనే చర్చ సాగుతోంది.